ఖమ్మం, ఫిబ్రవరి 6 : జిల్లాలోని కొత్తగూడెంలో మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి ఓ యువతి చెంపదెబ్బలతో బుద్ధి చెప్పింది. కొత్తగూడ రైల్వే స్టేషన్‌లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి యువతులతో పాటు అక్కడి స్థానికులు దేహశుద్ది చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు. రామవరం ప్రాంతానికి చెందిన యువతి గత రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్న సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చి ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. యువకుడి ఆగడాలు శృతిమించడంతో ఎదురుతిరిగిన యువతి అతనికి దేహశుద్ది చేసింది. రైల్వే పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.




