Thursday, 5 November 2026

గన్‌పార్క్‌ వద్దకు రాహుల్‌

తెలంగాణ అమరులకు నివాళి

హైదరాబాద్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): రెండురోజుల పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వివిధ కార్యక్రమాలతో మంగళవారం బిజీగా గడిపారు. ఆయన పర్యటన తుది దశకు చేరుకుంది. చివరిరోజు గన్‌ పార్కులో అమరవీరుల స్థూపానికి రాహుల్‌ నివాళులర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలతో కలిసి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే నిరుద్యోగ గర్జన సభకు బస్సులో బయలుదేరారు. ఇప్పటికే సరూర్‌నగర్‌ స్టేడియంకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ దిశా నిర్దేశర చేశారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితోపాటు, జానారెడ్డి, జైపాల్‌ రెడ్డి, షబ్బీర్‌ ఆలీ, రేవంత్‌ రెడ్డి, రేణుకాచౌదరి ఈ భేటీకి హాజరయ్యారు. ఉదయం యువ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అంతకుముందు సంపాదకులతో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ఆయన గన్‌పార్క్‌కు వచ్చి తెలంగాణ అమరులకు నివాళి అర్పించారు. రాహుల్‌ రాకతో ట్రాఫిక్‌ నిబంధనలు విధించడంతో పాటు, భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.