అమరావతి, ఏప్రిల్18(జనంసాక్షి) : జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన గన్‌మెన్లను వెనక్కి పంపారు. నెలరోజుల క్రితమే పవన్.. తనకు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పవన్‌కు నలుగురు గన్‌మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్‌మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే మంగళవారం రాత్రి పవన్ తన గన్‌మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. దీనికి కారణం జనసేన అంతర్గత వ్యవహారాలను ప్రభుత్వం గన్‌మెన్ల ద్వారా తెలుసుకుంటుందని, వారి నుండి పార్టీలో జరిగే ప్రతి అంశంపట్ల క్షుణ్ణంగా తెలుసుకుంటుందని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేనకు చెందిన పలువురు ముఖ్య నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ వారిని వెనక్కు పంపినట్లు తెలుస్తోంది.




