Friday, 6 November 2026

గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం అందించాలి

గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం అందించాలి.

జిల్లా కలెక్టరు పమేలా సత్పతి

జనం సాక్షి, డిసెంబర్ 09,భువనగిరి న్యూస్ :

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన శుక్రవారం సభకు హాజరైన గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు తమ పేరును వీలైనంత త్వరగా నమోదు చేయించుకోవాలని, ఆరోగ్యం పరీక్షలు, పోషకాహారం, సలహాలు అందించడం జరుగుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్య శిశువు జన్మించడం జరుగుతుందని తెలిపారు. పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయడం ద్వారా సాధారణ డెలివరీలు జరుగుతాయని తెలిపారు. జంక్ ఫుడ్ తినవద్దని, పిల్లలకు అలవాటు చేయవద్దని అన్నారు. పోషకాహారం, ఆరోగ్యం, సీజనల్ వ్యాధుల నివారణ పట్ల అవగాహన కలిగించడం జరుగుతున్నదని తెలిపారు. బిడ్డకు మొదటి వెయ్యి రోజులు చాలా ప్ర్రాముఖ్యమైనవని, బిడ్డ మెదడు అభివృద్ధి వేగంగా వుంటుందని, పోషకాహార లోపానికి గురి కాకుండా కాపాడాలని, అందుకోసం తల్లి పోషకాహారం తీసుకోవాలని, ఐరన్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని, రక్తహీనత తగ్గించడం కోసం ప్రతి తల్లి ఆకు కూరలను రోజూ తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల, సమావేశాలకు తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలని, పిల్లలకు సమయం కేటాయించి గడపాలని, వారిని గమనిస్తూ వుండాలని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, మండల పంచాయితీ అధికారి, సర్పంచ్ జక్క కవిత రాఘవేంద్రరెడ్డి ,సిడిపిఓ స్వరాజ్యం, సూపర్వైజర్లు పాల్గొన్నారు.