Tuesday, 3 November 2026

గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతికి పాల్పడుతున్న సభ్యులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

గద్వాల నడిగడ్డ, జులై 3 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం, ఉప్పేరు గ్రామంలో గీత పారిశ్రామిక సహకారం సంఘంలోని సభ్యులు కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామానికి చెందిన రాఘవ గౌడ్ సోమవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాఘవ గౌడ్ మాట్లాడుతూ ధరూర్ మండలంలోని ఉప్పేరు గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సొసైటీలోని కొందరు సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని గత సంవత్సరం అక్టోబర్ 18న, ఈ సంవత్సరం మే13, 22, జూన్ నెలలో ఎక్సైజ్ సీఐకి సొసైటీ అధ్యక్షులు, సభ్యులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. గీత పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న నరేష్ గౌడ్, తిమ్మప్పగౌడ్, వెంకటేష్ గౌడ్, రవీందర్ గౌడ్, విజయచందర్ గౌడ్, భగవంతు గౌడ్, నరసింహులు గౌడ్ లు ఉప్పేరు, ఖమ్మంపాడు, నర్సన్ దొడ్డి, వానపల్లి, జీరబండ గ్రామాలలో అక్రమంగా ఈత వనము లేకుండానే స్వయంగా వారే కల్తీ కల్లు తయారు చేసి ఇతర వ్యక్తుల ద్వారా కల్లు దుకాణాలు నడిపిస్తున్నారని తెలిపారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా ఈత చెట్టు ఎక్కి గీత గీయడం తెలియదన్నారు. అలాగే రవీందర్ గౌడ్ తండ్రి భగవంతు గౌడ్ తమ ఇంటి వద్ద గుడిసెలో డిపో లైసెన్స్ లేకున్నా అక్రమంగా కల్లు డిపోను ఏర్పాటు చేసుకొని స్వయంగా కల్తీ కల్లు తయారు చేసి అక్రమ దందాకు తెరలేపారని అన్నారు. దీనిపై గత సోమవారం సైతం ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాఘవ గౌడ్ తెలిపారు. అయిన ఇప్పటివరకు వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ కి విన్నవించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ వెంటనే ఎక్సైజ్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, కల్తీ కల్లు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారనీ అన్నారు.