గుండెపోటుతో ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కడియం రాజు మృతి
మిర్యాలగూడ, జనం సాక్షి.
ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ వర్కింగ్ కమిటీ సభ్యులు, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కడియం రాజు గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు . కడియం రాజు. జాతీయ ఎస్సీ ఎస్టీ, దివ్యాంగుల విద్య నియంత్రణ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఏబీవీపీ,ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి ఉస్మానియా యూనివర్సిటీ లో యువ సంచలనం గా పేరు పొందారు. డాక్టర్ కడియం రాజు నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గం.కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొత్తగూడెం, కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్మీడియట్ నాగార్జున జూనియర్ కళాశాల, కే ఎన్ ఎం డిగ్రీ కళాశాల మిర్యాలగూడలో డిగ్రీ పూర్తి చేసారు. ఇంటర్మీడియట్ నుండి దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీ లో క్రియాశీలకంగా పనిచేస్తూ కే ఎన్ ఎం డిగ్రీ కళాశాల ఏబీవీపీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. పేదరికం వెక్కిరిస్తున్నా జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా 2002 సంవత్సరంలో ఉన్నత విద్యకై ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కళాశాల, ఎం ఏ చరిత్ర విభాగంలో అడ్మిషన్ పొందారు. బీ ఈ డి , చరిత్ర విభాగం లొనే ఎం పిల్ పిహెచ్డి పూర్తి చేశారు.2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రేయాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్లు, 108 రోజులు జైలు పాలయ్యారు. ఏబీవీపీ లో తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్ , సిటీ సెక్రెటరీ, స్టేట్ సెక్రెటరీ, నేషనల్ సెక్రెటరీ, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. జాతీయ ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగుల విద్య నియంత్రణ కమిటీ సభ్యులుగా భాద్యతలు నిర్వర్తించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో తెలంగాణ రణ భేరి” లో సుష్మా స్వరాజ్ ఆత్మహత్యలు వద్దు- బ్రతికుండి తెలంగాణ సాధిద్దాం అని గర్జించిన రణభేరికి కడియం రాజు సభాధ్యక్షత వహించారు.అదేవిధంగా ఏబీవీపీ తెలంగాణ సాధనకై నిర్వహించిన మహాపాద యాత్ర లో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, సాగర హారం, ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థుల నిరాహార దీక్షలు ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమం లో డా.కడియం రాజు ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టు లలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్స్ బిల్లులు, స్కాలర్షిప్పులు, మౌళిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణంకై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.