గుజరాత్లో విషాదం… 19 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాలు తీసుకెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 19 మంది దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. భావనగర్-అహ్మదాబాద్ హైవేపై బవల్యాలీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సిమెంటు బస్తాలతో పాటు 25 మంది కూలీలు, వారి పిల్లలను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కూలీలపై సిమెంట్ బస్తాలు పడటంతో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో 16 మంది కూలీలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టారు.