నల్లగొండ
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అక్కడ పర్యటించారు. చిన జీయర్ స్వామితో కలిసి ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ప్రధాన యాదగిరిగుట్టతో పాటు.. రాష్ర్ట ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకున్న చుట్టుపక్కల గుట్టలను కూడా చినజీయర్ స్వామికి కేసీఆర్ చూపించారు.
యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజుపేట మార్గాలు.. ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనులను చినజీయర్ కు సీఎం కేసీఆర్ వివరించారు. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను కూడా చూపించి, వాటిని పర్యాటక కేంద్రాలుగా మిషన్‌కాకతీయ ద్వారా తీర్చిదిద్దుతామన్నారు.
గుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న రిజర్వు ఫారెస్టుని నరసింహస్వామి అభయారణ్యంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలను సీఎం వివరించారు. ఆలయ ప్రాంగణంలోని అణువణువును చినజీయర్ స్వామికి కేసీఆర్ చూపించారు. పద్నాలుగున్నర ఎకరాల స్థలం గుట్ట పైభాగంలో వేర్వేరు ఎత్తులో ఉందని, ఆరు ఎకరాల స్థలంలో ప్రధాన ఆలయం అభివృద్ధి చేస్తామని చెప్పారు. దాని చుట్టూ మాడ వీధులు నిర్మిస్తమని మ్యాపుల సహాయంతో వివరించారు.
ఆంజనేయస్వామి విగ్రహం, యాగశాల, ప్రవచనశాల, వంటశాల, కళ్యాణమంటపం తదితర నిర్మాణాల ప్రతిపాదిత స్థలాలు, దిక్కులను చినజీయర్ స్వామికి సీఎం కేసీఆర్ చూపించారు. గుట్టపైనే 32 నరసింహుని రూపాలను ప్రతిష్టిస్తామన్నారు. ఆలయ నిర్మాణ రూపశిల్పులు, స్థపతి, వేదపండితులు దైవ క్షేత్రాల నిర్మాణ, నిర్వహణలో అనుభవజ్ఞులైన వారి సలహాలు సూచనలతో డిజైన్ తయారు చేసినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆంజనేయస్వామి విగ్రహానికి అనుబంధంగా భక్తుల మండల దీక్షల కోసం ఒక హాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రధాన గుడికి ముందుభాగంలో మరే పెద్ద నిర్మాణం రాకుండా విశాలమైన ప్రాంగణాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్వామి వారికి మహానైవేధ్యం సమర్పించే ఆహార పదార్థాల తయారీ కోసం ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వంటశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుట్ట పైభాగంలో 100 వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యం, గుట్ట కిందిభాగంలో 5 వేల వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రధాన ఆలయం ఉన్న గుట్టతోపాటు మరో 8 గుట్టలను కలుపుకుని నవ గిరులను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ వివరించారు. నవ గిరులకు నామకరణం చేయాల్సిందిగా చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కోరడంతో.. ప్రస్తుత యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. త్వరలోనే 8 గుట్టలకు నామకరణం చేస్తానని చినజీయర్ స్వామి తెలిపారు.
భక్తులు, పర్యాటకుల కోసం మోనోరైలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దేవస్థానం ఆధ్వర్యంలోనే వాహన సౌకర్యం కల్పించే ఆలోచన ఉందన్నారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ ను చినజీయర్ స్వామి అభినందించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలన్నీ ఆగమశాస్ర్తం ప్రకారం ఉన్నాయన్నారు. ఆలయ పవిత్రత, సంప్రదాయం, ప్రత్యేకతలు చెక్కు చెదరకుండా సమగ్ర అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని చిన జీయర్ స్వామి ప్రశంసించారు.




