Thursday, 5 November 2026

గురుకుల ఆడపిల్లల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ

బాలికల ఆరోగ్య పరిరక్షణపై డాక్టర్లతో అవగాహన తరగతులు

బాలికల రక్తహీనతను తగ్గించేందుకు ప్రత్యేక పోషకాహరం

నీట్‌, జేఈఈలలో సీట్లు సాధించేలా ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచే కోచింగ్‌

గురుకులాల్లో మార్కులతో పాటు ప్రమాణాలు పెరిగే విధంగా విద్యాబోధన

విద్యాశాఖ, ఇతర సంక్షేమ గురుకులాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సవిూక్ష

హైదరాబాద్‌,జూన్‌ 21(జ‌నం సాక్షి): రానున్న నీట్‌, జేఈఈ పరీక్షల్లో తెలంగాణ గురుకుల, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునే విధంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచే వారికి కోచింగ్‌ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆయా సంక్షేమ గురుకుల కార్యదర్శులను ఆదేశించారు. ఈ సంవత్సరం ప్రైవేట్‌ విద్యా సంస్థల కంటే గురుకుల విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారన్నారు. అయితే మార్కులు సాధించడమే కాకుండా మంచి ప్రమాణాలు కలిగిన విద్యార్థులను రూపొందించే విధంగా విద్యాబోధన, శిక్షణ ఉండాలని సూచించారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ఎవరితోనైనా పోటీ పడగలరనే నమ్మకాన్ని కల్పించాలని చెప్పారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్ల లో చదివే ఆడపిల్లల్లో రక్తహీనత లేకుండా ఉండేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని ఇవ్వాలని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం గైనాకాలజీ డాక్టర్లతో గురుకులాల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో ఒకే రకమైన మెను, వసతులు, పాఠ్యాంశాలు, అకాడమిక్‌ క్యాలెండర్‌, యూనిఫామ్స్‌, హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్ల పంపిణీ ఉండేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల కార్యదర్శులు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీల డైరెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గురువారం సచివాలయంలో సవిూక్ష నిర్వహించారు.

గత ఏడాది నుంచి విద్యాశాఖ, ఇతర శాఖల్లో విద్యాపరంగా తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఫలితాలు మంచిగా వస్తున్నాయని, వీటిని మరింత పెంచాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను కోరారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చే మెనులో పోషకాహారం పెంపొందించడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. అయితే ఇంకా కూడా ఆడపిల్లల్లో హెమోగ్లోబిన్‌ శాతం సాధారణంగా ఉండేదానికంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. ఆడపిల్లల్లోని ఈ రక్తహీనతను అధిగమించేందుకు ప్రత్యేక ఆహారంగా బెల్లంతో తయారు చేసే పల్లీపట్టీలు, నువ్వుల పట్టీలు, రక్తాన్ని పెంచే ఆహారాన్ని ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ఉదయం రాగిమాల్ట్‌, పాలు, అల్పాహారం ఇస్తున్నామని, మధ్యాహ్నం భోజనంలో 50 గ్రాముల నెయ్యి అందిస్తున్నామని, రాత్రి పూట మంచి భోజనం ఇస్తున్నామని తెలిపారు. దీనివల్ల గురుకుల విద్యార్థులలో చురుకుదనం పెరిగిందని, ఆరోగ్యం బాగుండడం వల్ల చదువు కూడా బాగా చదువుతున్నారని తెలిపారు.

బాలికలకు హెల్త్‌ కిట్స్‌

జూలై నుంచి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ అందిస్తున్నామని, ఇందులో బాలికలకు అవసరమైన 13 రకాల 50వస్తువులున్నాయన్నారు. ఇవన్నీ బ్రాండెడ్‌ కంపెనీలవే కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బాలికలకు రుతుస్రావ సమస్యలు రాకుండా ఉండేందుకు అవసరమైనన్ని సానిటరీ న్యాప్కిన్స్‌ అందిస్తున్నామన్నారు. బాలికలలో అనారోగ్య పరిస్థితులను నివారించి, ఆరోగ్య పరిరక్షణ పెంపొందించే విధంగా గైనిక్‌ డాక్టర్లతో అవగాహనచర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడే చదువుపై దృష్టిసారించగలరన్నారు.ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ లో గురుకుల పాఠశాలల ఫలితాలు ప్రైవేట్‌ పాఠశాలల కంటే బాగా వచ్చాయని, వచ్చే సంవత్సరం కూడా మరింత పెరిగేలా ప్రణాళికలు రూపొందించుకుని ఇప్పటి నుంచే అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. అయితే విద్యార్థుల్లో మంచి మార్కులు రావడంతో పాటు వారి ప్రమాణాలు కూడా అదే స్థాయిలో ఉండే విధంగా విద్యాబోధన ఉండాలన్నారు. రానున్న నీట్‌, జేఈఈ పరీక్షలలో ఎక్కువగా సిబిఎస్‌ఈ సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని, గురుకుల విద్యార్థులకు కూడా ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచే ఈ పోటీ పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధించేలా కోచింగ్‌ ఇవ్వాలని సూచించారు.సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలలో ఈ సంవత్సరం నుంచి పక్కాగా ఒకే అకాడమిక్‌ క్యాలెండర్‌, ఒకే రకమైన దుస్తులు(యూనిఫామ్స్‌), పోషక విలువలతో కూడిన ఒకే రకమైన మెను, ఆడపిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉద్దేశించిన హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్‌, ఒకే రకమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.ఈ సవిూక్షా సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌, బీసీ సంక్షేమ గురుకులాల డైరెక్టర్‌ భట్టు మల్లయ్య, మైనారిటీ గురుకులాల డైరెక్టర్‌ షఫీయుల్లా, విద్యాశాఖ గురుకులాలు, మోడల్‌ స్కూళ్ల డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ విద్యాశాఖ మౌలిక వసతులు, సంక్షేమ, అభివృద్ధి సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ మల్లేషం, రాష్టీయ్ర మాధ్యమిక శిక్ష అభియాన్‌ జేడీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.