గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
జహీరాబాద్ డిసెంబర్ 1( జనం సాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో జహీరాబాద్ మండలంలో హోతి(కె) లో గల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సూరి కృష్ణ నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్ధి దశ చాలా కీలకమైనదని, చెడుకు దూరంగా ఉంటూ, చదువుపై శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం అందించే అవకాశాలను అంది పుచ్చు కోవడమే కాకుండా విద్యార్థులందరూ చక్కగా చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. పాఠశాలలో తోటి బాలికల పట్ల, మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే 1098 లేదా 100 కు డయల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో చట్టంపై విద్యార్థులకు తెలియజేసారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ సెక్రటరీ సంతోష్ కుమార్ సాగర్, న్యాయవాది మానెన్న, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు




