– కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ‘అవిశ్వాసం’ రగడ
– సొంత పార్టీ మేయర్, చైర్మన్‌లపైనే అవిశ్వాసానికి కాలుదువ్వుతున్న తెరాస కౌన్సిలర్లు
– అధిష్టానం ఆదేశాలు బేఖాతర్!
హైదరాబాద్, జులై10(జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో గులాబీ కోటలో గుబులు రేగుతోంది. అధకార పార్టీ చేతిలో ఉన్న కార్పోరేషన్లు, మునిసిపాలిటీల్లో ‘అవిశ్వాసం’ చిచ్చు రేగడం ‘పెద్ద’లకు కంటి విూద కునుకు లేకుండా చేస్తోంది. సొంత పార్టీ మేయర్, చైర్మన్లపై అవిశ్వాస నోటీసులిస్తుండడం అధికార పార్టీని కలవర పెడుతోంది. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్.. బోధన్, బెల్లంపల్లి, వేములవాడ, హుజూరాబాద్, గద్వాల జిల్లా అయిజ తదితర మునిసిపాలిటీల్లో అవిశ్వాసం నోటీసులిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట, ఖమ్మం కార్పొరేషన్ ఇలా పలు ప్రాంతాల్లో తెరాస కౌన్సిలర్లు సొంత పార్టీ మేయర్, చైర్మన్‌లపైనే అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అవిశ్వాసానికి అనుమతివ్వండంటూ మంత్రికి విజ్ఞప్తులు..
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, చైర్మన్ల పదవీకాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో ఇప్పుడు చాలాచోట్ల అవిశ్వాసాలకు తెర లేస్తోంది. అవిశ్వాసానికి అనుమతివ్వాలంటూ వరంగల్, మంచిర్యాల సహా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇటీవలే మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన ససేమిరా అన్నట్టు తెలిసింది. రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై 39 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం వ్యవహారం ఏకంగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మెడకే చుట్టుకుంది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రాజీనామా చేస్తానని చెప్పేంత వరకు వెళ్లింది. ఇక.. బెల్లంపల్లి మునిసిపాలిటీకి సంబంధించిన 34 మంది కౌన్సిలర్లలో 29 మంది చైర్‌పర్సన్ సునీతా రాణిపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. భువనగిరి మునిసిపాలిటీ విషయానికి వస్తే చైర్‌పర్సన్ లావణ్య పార్టీలు మారడంతో ఆమెపై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ నామాల ఉమను పదవి నుంచి దించేందుకు అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఇప్పటికే అవిశ్వాసాన్ని ప్రకటించారు. మరో వైపు గద్వాల జిల్లా అయిజలోని 16 మంది టీఆర్‌ఎస్ కౌన్సిలర్లలో 11 మంది నేరుగా కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు ఇచ్చి చర్చనీయాంశంగా మారారు.
పాలమూరులోనూ అవిశ్వాస సెగలు!
ఉత్తర తెలంగాణ స్థానికసంస్థల్లో రాజకీయ కలకలం రేపుతున్న అవిశ్వాస సెగ పాలమూరునూ తాకింది. పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చట్టబద్ధమైన రక్షణగా ఉన్న నాలుగేళ్ల గడువు ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయా పురపాలికల్లో ఇన్నాళ్లూ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలంతా ఇపుడు అవిశ్వాస అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ పురపాలిక ఛైర్‌పర్సన్ రాజేశ్వరిపై 11 మంది కౌన్సిలర్లు సోమవారం ఆ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టరు రొనాల్డ్ రోస్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసును అందించారు. గత శనివారం నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ ఎంపీపీ రాజశేఖర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసును స్థానిక ఎంపీటీసీ సభ్యులు కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌కుమార్‌కు అందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, నారాయణపేట, బాదేపల్లి, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అయిజ పురపాలికలు ఉన్నాయి. ఇందులో బాదేపల్లి, కొల్లాపూర్ పురపాలికలకు పాలకవర్గమే లేదు. మిగతా పురపాలికల్లో కొన్నిచోట్ల
అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన మ్యాజిక్ సంఖ్యను చూసుకొంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నారాయణపేట మున్సిపాలిటీలో ఈనెల 15న అవిశ్వాసం పెట్టేందుకు బీజేపీ కౌన్సిలర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వీరికి అధికార పార్టీకి చెందిన మరికొంతమంది కౌన్సిలర్లు కూడా తోడవుతుండటం గమనార్హం. ఛైర్‌పర్సన్ల వైఖరిపై అసంతృప్తి, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కౌన్సిలర్లు ఇమడలేకపోవడం అవిశ్వాస తీర్మానాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అభివృద్ధి పనుల్లో విభేదాలు, వాటాల్లో తేడాలు, కాంట్రాక్టు పనులు చెప్పినవారికి ఇవ్వకపోవడం వంటి అంశాలు కూడా అవిశ్వాస తీర్మానాలకు దారితీసే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలోని అయిజ పురపాలిక ఛైర్‌పర్సన్‌పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు.
ఖమ్మంలో అంతర్గత పోరు..
ఖమ్మం జిల్లాలోనూ అంతర్గత పోరు కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్‌లో 50 మందికార్పొరేటర్లు ఉండగా అధికశాతం తెరాసకార్పొరేటర్లే ఉన్నారు. వీరిలో అధికంగా ప్రస్తుతం మేయర్‌గా ఉన్న పాపారావుపై అవిశ్వాసానికి ఇటీవలే సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు సర్దిచెప్పినా అవిశ్వాసానికి మొగ్గు చూపారు. కానీ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలవడంతో సమస్య కొంతమేర సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. నివురుగప్పిన నిప్పలా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఏకపక్ష ధోరణెళి కారణం..
రాష్ట్రవ్యాప్తంగా పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులకు ఛైర్‌పర్సన్లు, వారి భర్తల ఏకపక్ష ధోరణెళి కారణమన్న విమర్శలూ వినవస్తున్నాయి. కౌన్సిలర్లను పట్టించుకోకపోవడం, వారి ప్రతిపాదనలను బుట్టదాఖలు చేయడం తదితర కారణాలతో కౌన్సిలర్లలో అంతర్గతంగా అసంతృప్తి వెంటాడుతోంది. ప్రస్తుతం పురపాలికలకు నాలుగేళ్ల గడవు దాటడంతో అవిశ్వాస తీర్మానాలు తెరపైకి వస్తున్నాయి. దీంతోపాటు పలుచోట్ల అభివృద్ధి పనుల వాటాల్లో తేడాలు ఉండటం, తమ వార్డులో చెప్పిన గుత్తేదారుకు పనులు అప్పగించకపోవడం తదితర కారణాలు కూడా అవిశ్వాస తీర్మాన నోటీసుల వరకు వెళ్తున్నాయి. మరి ఈ సమస్యకు అధిష్టానం ఏ మేరకు చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే మరి
గులాబీలో గుబులు




