Tuesday, 3 November 2026

గోకుల్ చాట్ ఘటనకు నేటికి ఎనిమిదేళ్లు…

gwrlaufcహైదరాబాద్ :అదో పీడకల. ఆనాటి చేదు జ్ఞాపకాలను నగర ప్రజలు ఇంకా మరిచిపోలేదు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో పేలుళ్లు జరిపి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు. ఆ రెండు ఘటనల్లో 42 మంది చనిపోగా..వందలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి.. దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. గాయపడ్డవారిలో కొందరు ఇప్పటికీ జీవశ్చవాలుగా బతుకీడుస్తున్నారు. వారికి నేటికీ ప్రభుత్వ సాయం అందలేదు.

2007వ సంవత్సరం, ఆగస్టు 25వ తేదీ…….

ప్రశాంతంగా ఉండే భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ -బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు విసిరిన పంజా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన లుంబినీ పార్క్, గోకుల్- చాట్-లో పేలుళ్లు జరిగాయి. లుంబినీ పార్క్-లో రాత్రి ఏడున్నరకు లేజర్-షో మొదలైంది. 500 మంది వరకు టూరిస్టులు లేజర్ షో ను చూస్తూన్నారు. వందేమాతర గీతాలాపన అప్పుడే పూర్తయి, గుడ్ -ఈవినింగ్- హైదరాబాద్ అంటూ స్వాగత వచనం పలుకుతున్న సమయంలో భారీ విస్పోటం తో బాంబులు పేలాయి. సీట్ల మధ్యలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో అ ప్రదేశంలో కూర్చున్నవాళ్ల శరీర అవయవాలు గాల్లోకి ఎగిరి పడ్డాయి.

ఏం జరిగిందో తెలుసుకునే లోపే ….

ఏం జరిగిందో తెలుసుకునే లోపే అనేక మంది రక్తపు మడుగులో పడిఉన్నారు. తెగిపడ్డ అవయవాలు, రక్తమోడుతున్న శరీరాలు, కాల్వలు కట్టిన రక్తపు ధారలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రాణాలతో బయటపడ్డ సందర్శకులంతా భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోనూ కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. పేలుడు ధాటికి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరి కొందరు మృతి చెందారు.

సాయంత్రం7 గంటల40 నిమిషాలసమయం….

లుంబిని పార్క్ లో పేలుడు జరిగిన కొద్ది క్షణాల్లోనే గోకుల్ చాట్ లో మరో పేలుడు జరిగింది. 7 గంటల 40 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుడుతో మొత్తం 42 మంది మృతి చెందారు. 72 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న వారు ఇప్పటికీ.. ఆ చేదు జ్ఞాపకాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. ఏ చిన్న శబ్ధం వినిపించినా భయంతో వణికిపోతున్నారు. ఇక ఆ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు, గాయపడ్డ బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వ సాయం పూర్తిగా అందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *