Tuesday, 3 November 2026

గోదాం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

హుజూర్ నగర్ జూన్ 26 (జనంసాక్షి): మండలంలోని వేపల సింగారం గ్రామంలో 38 లక్షల రూపాయల వ్యయంతో 500 ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణ పనులను ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఊరే రాధాకృష్ణ లతో కలిసి హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి పరిశీలించారు. సోమవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 24 గంటలు కరెంటు, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ ట్రాక్టర్ల పై పన్ను రద్దు వంటి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతాంగానికి క్రాప్ లోన్స్ తో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయించారని అన్నారు. వేపల సింగారం గ్రామంలో ఎమ్మెల్యే శానంపూడి సహకారంతో నిర్మిస్తున్న గోదాం నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్తులో సహకార సంఘం చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే తోడ్పాటు తప్పక ఉంటుందని జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ సారెడ్డి సీతారాంరెడ్డి, సీఈవో చీకూరి లింగయ్య తదితరులు ఉన్నారు.