గోదాదేవి అమ్మవారికి వైభవంగా మహిళలచే వడి బియ్యం
హుజూర్ నగర్ జనవరి 9 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీవేణుగోపాల సీతారామ చంద్రస్వామి వారి దేవాలయంలో
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం గోదాదేవి అమ్మవారికి వడి బియ్యం మహిళలచే సమర్పించడం జరిగింది. ప్రాతః కాలంలో భక్తుల గోత్రనామాలతో పూజను ప్రారంభించి, విష్ణు సహస్రం, గోదా, రామానుజ అష్టోత్రాలను జరిపారు. మహిళలు తిరుప్పావైని శ్రావ్యంగా పఠించారు. స్థానిక దంపతులు దోసపాటి నరసింహమూర్తి, శోభారాణి కుటుంబ సభ్యుల ఇంటి వద్ద నుండి ఒడిబియ్యాన్ని దేవాలయానికి మేళతాళాలతో, అన్నమయ్య భజన మండలి వారి కీర్తనలతో తీసుకువచ్చారు. అనంతరం గోదా అమ్మవారిని మండపంలో భద్రపీఠంపై అధిష్టింపజేసి షోడశ ఉపచారాలను అర్చకులు జరిపించారు. పట్టు వస్త్రాలతో పూలు, తులసిమాలతో అమ్మవారిని అందంగా అలంకరించి అష్టోత్తరాలు జరిపారు. పూజ చేయించే దంపతులతో కుంకుమార్చన జరిపించారు. తర్వాత తొమ్మిది రకాల పండ్లతో, స్వీట్లతో, పూలదండలతో ఒడిబియ్యాన్ని దేవాలయం చుట్టూ మేళతాళాలతో ముమ్మారు ప్రదక్షిణ గావించారు. అనంతరం పూజ చేయించిన భక్తులకు అర్చకులు శ్రీ స్వామి వారి శేష వస్త్రం తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో గుజ్జుల కొండారెడ్డి, అర్చకులు, స్నానాచార్యులు, పదో వార్డ్ కౌన్సిలర్ గుండా ఫణి కుమారి, పుర ప్రముఖులు విశేషంగా మహిళలు పాల్గొన్నారు.
గోదాదేవి అమ్మవారికి వైభవంగా మహిళలచే వడి బియ్యం




