Tuesday, 3 November 2026

గోప్యమా..! భయమా..?

సమాచారమిచ్చేందుకు నిరాకరిస్తున్న అధికారి
కలెక్టర్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం
కార్యాలయానికి వచ్చి చూసి పోవాలని ఉచిత సలహా
అనర్హులకు ఇచ్చిన కార్డులు వెనక్కి తీసుకున్న సిబ్బంది
అయినా అర్హులకు న్యాయం చేయడంలో విఫలం
ఆసిఫాబాద్ డీపీఆర్ఓ కార్యాలయంలో విచిత్ర పరిస్థితి
– ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ 9640466464
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
రెండు, మూడు జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో గుర్తింపు కార్డులు ఇచ్చేయగా.. మరికొన్ని జిల్లాల్లో మొదటి జాబితా అంటూ లిస్ట్ విడుదల చేశారు. రెండో జాబితాలో మిగితా వారికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే అన్ని జిల్లాలకు విరుద్ధంగా ఆసిఫాబాద్ పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరికి కార్డులు ఇచ్చారో.. ఎవరికి ఇవ్వలేదో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు లిస్ట్ ఇవ్వడానికే అక్కడి సిబ్బంది ఒప్పుకోవడం లేదు. గోప్యత పాటిస్తున్నామని చెబుతున్నారు. కలెక్టర్ ఇవ్వవద్దని చెప్పారని ఆయన మీద నెపం నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఏది వాస్తవమో.. ఏది అవాస్తమో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఎన్నో కార్డులు వెనక్కి..
ఆసిఫాబాద్ లో మొదటి విడతలో సుమారు 250 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిసింది. అయితే ఆ సంఖ్యను అక్కడి డీపీఆర్ఓ నిర్ధారించడం లేదు. ఎన్ని కార్డులు మంజూరు చేశారో లెక్క చెప్పేందుకు కూడా సిద్ధమవడం లేదు. అయితే కలెక్టర్ ద్వారా అప్రూవల్ గా తీసుకున్న లిస్ట్ లో చాలా మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు ఉన్నారు. వీరి కార్డులను అక్కడి సిబ్బంది ప్రింటింగ్ సైతం చేయించారు. చాలా మందికి ఇచ్చేశారు. తీవ్ర ఆరోపణలు, విమర్శలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇచ్చిన కార్డులను వెనక్కి తీసుకున్నారు. అసలు మంజూరు చేసే సమయంలో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అక్కడి జర్నలిస్టులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న లెక్చరర్లు, ఉద్యోగులు ఇలాంటి కార్డులు తీసుకుంటే, ఎవరైనా వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వారి ఉద్యోగాలు కూడా ఊడిపోయే ప్రమాదముంది.
లెక్క తేల్చరేం..
పౌర సంబంధాల శాఖ కార్యాలయం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల కార్యక్రమాల సమాచారాన్ని జర్నలిస్టుల వరకు చేరుస్తుంది. అయితే ఆ శాఖ కార్యాలయ సమాచారమే ఇవ్వడానికి ఆసిఫాబాద్ కార్యాలయ సిబ్బంది నిరాకరిస్తుండడం విస్తుగొలుపుతోంది. అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్, అప్రూవల్, కార్డుల ప్రింటింగ్ పూర్తయి వారం రోజులు గడుస్తోంది. అయినా ఎందరికి కార్డులు ఇచ్చారో లెక్క చెప్పేందుకు అక్కడి అధికారులు సిద్ధంగా లేరు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎందరికి మంజూరు చేశారు? ఎందరిని రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ చేయడానికి గల కారణాలు అడిగితే అధికారులు నిరాకరిస్తున్నారు. కలెక్టర్ వద్దని చెబుతున్నారని ఆయనపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్రిడిటేషన్ల జారీలో గోప్యత ఎందుకు అవలంభిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీని వెనక ఏమైనా మతలబు ఉందా అనే అనుమానాన్ని పలువురు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.