గోవింద నామస్మరణంతో మార్మోగిన వైష్ణవాలయాలు…
భైంసా రూరల్ జనవరి 02జనం సాక్షి
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భైంసా పట్టణం లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఉత్తర ద్వార దర్శనం చేశారు. గోవింద నామ స్మరణం తో ఆలయ ప్రాంగణం అంతా మారు మోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి తులసి దళాలతో కొలిచి హారతి కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం అర్చకులు మాట్లాడుతూ మహావిష్ణువుకు ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో విష్ణువును దర్శించుకోవడం మోక్షదాయకమని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఈ రోజున వైకుంఠ సప్తద్వారాలు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారంగా భావించి వేకువజాము నుంచే భగవత్ దర్శనార్థం భక్తులు నిరీక్షిస్తారన్నారు. ఇదే రోజున మహావిష్ణువు గరుడ వాహనారుడై ముక్కోటి దేవతలతో కలిసి భువికి దిగివచ్చి దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. ఈరోజు సూర్యోదయానికి ముందే స్నాన, సంద్యాధులు పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే ఆ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.




