మానకొండూరు ,ఆర్ సి, మార్చి 2 (జనం సాక్షి)
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంట గ్యాస్ ధరలపై భరాస శ్రేణులు బగ్గుమన్నాయి. కరీంనగర్ – వరంగల్ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మానకొండూరులో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రాదేశిక సభ్యులు, భరాస పార్టీ మానకొండూరు మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా, రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంట చేసి, ప్లకార్డులు, సిలిండర్లను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన , నిరసనల కార్యక్రమానికి మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ హాజరయ్యారు. గడచిన తొమ్మిది ఏళ్లలో వంట గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు మూడు రేట్లు పెంచిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద, మధ్యతరగతి జీవుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే ప్రతిసారీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలతో ప్రజల కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పేదల పాలిట శత్రువు అని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని అసమానతలు నిరుద్యోగం పెరిగి సామాన్యుడి కొనుగోలు సామర్థ్యం అట్టడుగు స్థాయికి పడిపోయిందన్నారు. మహిళలపై ప్రధానమంత్రి మోదీ వివక్ష చూపుతున్నారని ఇందుకు గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు ఉదాహరణ అని రసమయి అన్నారు. పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేసిన భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలి అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మానకొండూరు మండల ఎంపీపీ ముద్దసాని సులోచన, ఎంపీటీసీలు పిట్టల కవిత, ఉండింటి సులోచన, మానకొండూరు మండల మహిళా అధ్యక్షురాలు బొంగొని రేణుక, కొండ్ర నిర్మల, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, అడప శ్రీనివాస్, పార్నంది కిషన్, నెల్లి శంకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు కన్వీనర్లు, గ్రామ మండల స్థాయి కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంస్థల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు ,పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు నిరసన కార్యక్రమానికి హజరయ్యారు.
గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పోరుగ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పోరు ……. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం …… పెంచిన ధరలను తగ్గించాల్సిందేనని ఎమ్మెల్యే రసమయి డిమాండ్ … ధర్నా…… రాస్తారోకో ……గ్యాస్ ధరలపై భగ్గుమన్న భారాస శ్రేణులు




