గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై రేవంత్ రెడ్డి సెటైర్
హైదరాబాద్ (జనం సాక్షి)
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై రూ.200 తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక గజదొంగ దారిదోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
పూర్తి ట్వీట్..
“ఒక గజదొంగ దారిదోపిడీ చేసి…
సర్వం దోచుకుని, దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచుకోమని ఇచ్చాడట…”
కాంగ్రెస్ హయాంలో రూ.410 ఉన్న గ్యాస్ బండ ధరను… రూ.1200 చేసి, ఇప్పుడు రూ.200 తగ్గించడాన్ని ఇలా కాక మరెలా అర్థం చేసుకోవాలి!?
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, బీఆరెస్ నేతలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బస్తీలలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.