బిచ్కుంద మే (జనంసాక్షి)గ్రామాలలో సంవత్సరాల నుండి నిధులు లేక సర్పంచులు పరేషాన్ అవుతున్నామని, నిధులేమో అసలే ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. ఉన్న నిధులు కాస్తా ఫ్రీజింగ్ చేస్తున్నారని, పెండింగ్ నిధులు విడుదల చేసి సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వేడుకుంటున్నారు. గ్రామ పంచాయతీలకు రాజ్యంగ పరంగా, ఫైనాన్స్ కమీషన్స్ ప్రకారం ఎన్ని నిధులు రావాలో అన్ని నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019- 2020లో వచ్చిన నీధులతో పోలిస్తే 2020-2021, 2021- 22 2022-23 వరకు 60% మాత్రమే నిధులు వస్తున్నాయనీ తెలిపారు. గ్రామ పంచాయతీకి సకాలంలో CFC కానీ, SFC కానీ నిధులు రాకపోవడం. నిధులు ఫ్రీజింగ్ సమస్య అంటే తాము అందజేసిన చెక్కులు దాదాపు ఆరు నెలలైనా చెక్కులు పాస్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పై అధికారుల ఒత్తిడితో సర్పంచులందరూ తమ సొంత డబ్బులు సరిపోకుంటే మరీ అప్పు చేసి ఎన్నికలలో తమను గెలిపించిన గ్రామ ప్రజల కోసం అభివృద్ధి పనులు చేసారు. సిసి రోడ్డు, మురికి కాలువలు, కల్వర్టులు పనులు పూర్తి చేసి సంవత్సరాలు గడిచినా బిల్లులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక రకాల గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు రాలేదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతికి వచ్చిన నిధులు
కరెంటు బిల్లులు కట్టుటకు, కార్మికుల జీతాలు చెల్లించుటకు, ట్రాక్టర్ ఈఎంఐ చెల్లించుటకు, ట్రాక్టర్ నిర్వహణ, డిజిల్ పోయించుటకు, తదితర వాటన్నింటిని చెల్లించగా గ్రామంలో హారితహారం ప్రోగ్రాంలో చెట్లకు ట్రీ గార్డులు, కట్టెలకు నిధులు ఏమాత్రం సరిపోవట్లేదనీ పేర్కొంటున్నారు. ఎస్ఎఫ్ సీ నిధులు ఏప్రిల్ ఒకటవ తేదీ కంటే ముందే విడుదల చేస్తామని మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడైనా ప్రభుత్వం సర్పంచుల ఆవేదన పట్టించుకోవాలని జనం కోరుతున్నారు.




