సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 10 :-జూన్ 11న జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు.
శనివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్ష సజావుగా జరిగేలా ఆయా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు తూచా తప్పకుండా పాటించాలని చీఫ్ సూపర్డెంట్ లకు సూచించారు.
అభ్యర్థులు ఎవరికైనా హాల్ టికెట్ పైన ఫోటో రానట్లయితే, సంబంధిత అభ్యర్థి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ సంతకం చేసిన
మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకు రావాలని, అదేవిధంగా ఇతర ఐడి ప్రూఫ్ కూడా తీసుకురావాలని సూచించారు.
రూట్ ఆఫీసర్లు నిర్ణీత సమయంలో మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. లైజన్ ఆఫీసర్లు పరీక్ష కేంద్రం ఎంట్రన్స్ లోనే హాల్ టికెట్లు, ఐడి ప్రూఫ్ లను పరిశీలించి అభ్యర్థులను లోనికి పంపాలన్నారు.
నిబంధనల మేరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని, సీసీ కెమెరాలు పనిచేస్తున్నది లేనిది చూసుకోవాలని చీఫ్ సూపర్డెంట్ లకు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు.144 సెక్షన్ అమల్లో ఉండాలని, పరీక్ష కేంద్రాలను దగ్గరలో, పరిసరాలలో గల జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయించాలన్నారు.
పరీక్ష కేంద్రం లోపల ఏఎన్ఎంను మెడికల్ కిట్ తో అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.మరో మారు త్రాగునీరు తదితర మౌలిక వసతుల కల్పన చూసుకోవాలని తెలిపారు.
రూట్ ఆఫీసర్లు అలా చేసిన కేంద్రాలకు సంబంధించిన మెటీరియల్ సరిగ్గా చూసుకొని తీసుకురావాలన్నారు.
టీఎస్ పి ఎస్సీ సూచించిన మేరకు నంబరింగ్, సీటింగ్ ప్లాన్ చేసుకోవాలన్నారు. నోటీస్ బోర్డులో హాల్ టికెట్ నంబర్లు, హాల్ నెంబర్ తదితర వివరాలను ప్రదర్శించాలని, అదేవిధంగా సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఉర్దూ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులకు వేరు వేరుగా హాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
పరీక్ష కేంద్రం లోకిచీఫ్ సూపర్డెంట్లు, లైజన్ ఆఫీసర్లకు మినహా ఎవ్వరికి కూడా సెల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు.
టెలికాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, చీఫ్ సూపర్డెంట్లు, డిఆర్వో నగేష్, సంగారెడ్డి పటాన్చెరు డి.ఎస్.పిలు,ఆర్డిఓ రవీందర్ రెడ్డి, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.




