Monday, 2 November 2026

ఘనంగా మహాబతుకమ్మ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): ఎల్బీ స్టేడియంలో జరిగిన మహాబతుకమ్మ వేడుక రికార్డు సృష్టించింది. గతేడాది 10 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని గిన్నిస్‌ బుక్‌ లోకెక్కగా? ఈసారి 40వేల మంది ఆడపడుచులు బతుకమ్మ ఆడి గత రికార్డు బ్రేక్‌ చేశారు. 429 మండలాల నుంచి భారీగా తరలి వచ్చిన మహిళలు సాయంత్రం నాలుగింటి నుంచి తొమ్మిదింటి దాకా మహా బతుకమ్మ చుట్టూ చేరి ఉయ్యాల పాటలతో ¬రెత్తించారు. ఈ ఉత్సవంలో 3వేల మంది మహిళలు తంగేడుపువ్వు రూపంలో నిల్చుని బతుకమ్మ ఆడుతూ కనువిందు చేశారు.ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు ఐదువేల మంది మహిళలు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఆడిపాడారు. ఉయ్యాల పాటలు.. బతుకమ్మ ఆటలతో మైమరిచిపోయారు.పూలసందడి హైదరాబాద్‌ను కనువిందు చేసింది. బతుకమ్మ వేడుకల్లో మహాబతుకమ్మ సందడి చేసింది. వేలాదిమంది మహిళలు రాగయుక్తంగా ఆడుతూపాడుతూ బతుకమ్మ ఆడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. 19 రాష్టాల్రకు చెందిన కళాకారులతో ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత వేడుకలను ప్రారంభించి పాల్గొన్నారు. శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ వేడుకలను వీక్షించేందుకు హాజరయ్యారు. 15 రాష్టాల్ర నుంచి తరలివచ్చిన బ్రహ్మకుమారీలు తమ ప్రత్యేక దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలకు వేలాది మంది మహిళలు బతుకమ్మలను పేర్చుకుని స్టేడియానికి చేరుకున్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో స్టేడియం మొత్తం పూలవనంగా మారిపోయింది. అలాగే మహిళల ఆట పాటలతో స్టేడియం మార్మోగింది. 31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు వలయాకారంలో లయబద్దంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఉయ్యాల పాటలతో ఎల్బీ స్టేడియం మార్మోగిపోయింది. సంస్కృతి వైభవానికి ప్రతీకగా మహాబతుకమ్మ నిలిచింది. మహిళలందరూ మురిపెంగా ఆడిపాడుతున్నారు. గిన్నిస్‌ బుక్‌ లో చోటు సంపాదించడమే లక్ష్యంగా మహిళలుబతుకమ్మ ఆడుతున్నారు. ఈ వేడుకల్లో కెవి రమణాచారి మామిడి హరికృష్ణ, బుర్రా వెంకటేశం, పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి తెలిపారు. గత ఏడాది పది వేల మంది మహిళలతో ఇదే స్టేడియంలో నిర్వహించామన్నారు. ఈ ఏడాది 30 నుంచి 35 వేల మందితో ‘మహా బతుకమ్మను’ నిర్వహించాలని నిర్ణయించగా భారీ స్పందన వచ్చిందని, మహిళలు వేలాదిగా తరలి రావడంతో స్టేడియం నిండిపోయిందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ కోసం జిల్లాకు రూ. 3 లక్షలు మంజూరు చేశామని చెప్పారు.పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నందున దీనిపై ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మకు ఆదరణ పెరగడం ఖాయమని అన్నారు. ఇదిలావుంటే నెల 28న సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నట్లు పర్యాటకం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. దీన్ని ఎల్బీ స్టేడియంలోనే నిర్వహిస్తామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జిల్లాలకు చెందిన 3 నుంచి 5 వేల మంది మహిళలు సద్దుల బతుకమ్మలతో పాల్గొని ఆట-పాట నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వ ర్యంలో మహిళలందరూ వెళ్లి హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈ సద్దుల బతుకమ్మను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కోసం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 28న గిన్నీస్‌ రికార్డు ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాల కారణంగా ఆయా మార్గాల్లో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.