చిత్తూరు,నవంబర్13(జనంసాక్షి): ఆర్‌బిఐ , ఎన్నికల కమిషన్, సిబిఐలు ప్రధాని నరేంద్ర మోడీ కబంధ హస్తాలలో నలిగి పోతున్నాయని సిపిఐ నారాయణ అన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో కాపురం చేస్తాడో తెలీదని ఎద్దేవా చేశారు. చిత్తూరులో మంగళవారం సిపిఐ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. బిజెపి వ్యతిరేక శక్తులను దేశవ్యాప్తంగా ఏకం చేస్తామని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారని, 50 రోజుల్లో నోట్ల రద్దు ప్రయోజనాలు లేకుంటే తనను కాల్చి చంపవచ్చని మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఈ లెక్కన మోడీని 24 సార్లు కాల్చి చంపాలని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లయినా పాశ్చాత్తాపం కూడా ప్రకటించన నేతని అన్నారు.




