Wednesday, 4 November 2026

చంద్రబాబు దయా దాక్షిణ్యాలపై.. కాంగ్రెస్‌ నడుస్తోంది

– ఎన్నికల తరువాత బాబు కూటమిలో కేసీఆర్‌ చేరుతారు
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌
హైదరాబాద్‌, నవంబర్‌6(జ‌నంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దయా దాక్షిణ్యాలపై కాంగ్రెస్‌ నడుస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా చంద్రబాబు చేతుల్లో పెట్టారన్నారు. గతంలో టీడీపీని తూర్పారబట్టిన కోదండరామ్‌.. ఇప్పుడు చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతుంటే జనం విస్తుపోతున్నారని ఆయన అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు.. రజాకార్ల అడుగులకు మడుగులొత్తుతున్నాయని లక్ష్మణ్‌ విమర్శించారు. ఎన్నికల తరువాత చంద్రబాబు కూటమిలో కేసీఆర్‌ చేరుతారని, మేం మిషన్‌ 60 పేరుతో ముందుకు వెళుతున్నామని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కాంగ్రెస్‌లో చీలిక వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బిజెపి నీతి నిజాయితీతో పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో 60 సీట్లు గెలుచుకోవడమే బిజెపి లక్ష్యమని ఆయన చెప్పారు. బిజెపి అభ్యర్థుల ప్రకటన తరువాత అనూహ్య స్పందన వచ్చిందని ఆయన అన్నారు.