Friday, 6 November 2026

చంద్రబాబు నమ్మక ద్రోహి

– ఒకప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు చంద్రబాబుకు తేడా ఉంది
– వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నరకం చూపిస్తుంది
– వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి
– అధికారంలోకి వచ్చాక రోజాకి కీలక పదవి – విజయసాయిరెడ్డి
చిత్తూరు, నవంబర్‌17(జ‌నంసాక్షి) : చంద్రబాబు నమ్మక ద్రోహి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా భర్త సెల్వమణి సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైఎస్సార్‌సీపీ శనివారం నగరిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు… ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన తొలిసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని, నమ్మక ద్రోహిగా ఆయనను వర్ణించారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వభావం తెలిసి అసహించుకున్నానని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని అన్నారు. దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా మై ఎమ్మెల్యే యాప్‌ను రోజా ప్రారంభించారు. తాను చేసిన అభివృద్ధి ఏంటో ఈ యాప్‌ ద్వారా ప్రజలందరూ
తెలుసుకోవచ్చని రోజా తెలిపారు.
అధికారంలోకి వచ్చాక రోజాకి కీలక పదవి – విజయసాయిరెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మానసిన స్థితి బాగోలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తి సీఎంగా కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. చంద్రబాబును నరకాసురుడిగా వర్ణించారు. వచ్చే ఎన్నికల తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావడం ఖాయమని.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభిస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలపై రోజా అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.