Friday, 6 November 2026

సనత్‌నగర్‌ సీటు టీడీపీ అడగనే లేదు

– కుట్రపూరితంగానే ఉత్తమ్‌ ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు
– ఉత్తమ్‌ వల్లే నాకు సీటు రాలేదు
– అధిష్టానం మరోసారి తన స్థానంపై పునరాలోచించాలి
– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : సనత్‌నగర్‌ సీటు టీడీపీ అడగకుండానే కావాలని టీడీపీ కేటాయించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సనత్‌నగర్‌ స్థానం కావాలని టీడీపీ అడగనే లేదని, తనకు సీటు రాకుండా ఉండేందుకు కొందరు గట్టి ప్రయత్నాలు చేశారన్నారు. టీడీపీ వద్దని చెప్పినా కూడా బలవంతంగా సనత్‌నగర్‌ స్థానాన్ని ఆ పార్టీకే కేటాయించారని ఆరోపించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వల్లే తనకు సనత్‌నగర్‌ టికెట్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను రెండు విషయాల్లో కలత చెందుతున్నారని అన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి గెలువలేడు అని స్కీన్రింగ్‌ కమిటీ ముందు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గట్టిగా చెప్పడం, ఉత్తమ్‌ చేయించిన సర్వేలో తాను గెలవలేను అని తేలిందనడం తనను బాధించాయని పేర్కొన్నారు. కొన్ని ఛానెళ్లు చేయించిన ఆన్‌లైన్‌ సర్వేల్లో తనకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్లు తేలిందన్నారు. నామినేషన్‌ దాఖలుకు ఇంకా రెండురోజుల సమయం ఉందని, అప్పటి వరకు వేచి చూస్తానని సనత్‌నగర్‌ స్థానాన్ని తనకు అప్పగించేలా అధిష్టానం పునరాలోచించాలన్నారు. సికింద్రాబాద్‌ నుంచి తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని శశిధర్‌ రెడ్డి స్పష్టం చేశారు. సనత్‌నగర్‌ నుంచి తానైతేనే గెలుస్తానన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనూ ఉందన్నారు. టికెట్‌ కేటాయించలేనప్పుడు అభ్యర్థుల బలాబలాలు కూడా చూడాలన్నారు.  ప్రకటించిన జాబితాను మరోసారి పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనకు సుదీర్ఘమైన అనుభవం ఉందని, తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, ప్రభుత్వం, పార్టీలో ఎన్నో కీలక పదవులలో పని చేశానని మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు.