వీణవంక ఏప్రిల్ 29( జనం సాక్షి) వీణవంక అధ్యయనం- అధ్యాపనం- సామాజిక స్పృహ” అనే త్రినేత్రాలు లక్ష్యాలుగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటిఎఫ్ మూడవ నేత్రం సామాజిక బాధ్యతలో భాగంగా హఠాత్తుగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అండగా నిలబడి, ఆర్దిక చేయూతనిచ్చి ఆదుకోవడానికి “కుటుంబ సంక్షేమ నిధి” ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ పథకాన్ని మే 2న నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తుందన్నారు. జూన్ 1 నుండి ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. గరిష్టంగా 5వేల మంది సభ్యులను ఈ పథకంలో చేర్పించి మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఈ పథకం ద్వారా 15 రోజుల్లోగా రూ. 5 లక్షలను తక్షిణ ఆర్థిక సహాయంగా అందించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. 2004 సెప్టెంబర్ తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు పెన్షన్ లేదని, రిటైర్ అయిన తర్వాత వచ్చే సొమ్ము ఎంతో తెలియదన్నారు. మోడల్ స్కూల్స్, కేజీబీవీ ఉపాధ్యాయులు చనిపోతే కారుణ్య నియామకాలు లేక వారి కుటుంబాలు దుర్భర స్థితిలోకి నెట్టివేయబడుతున్నాయన్నారు.ఇలాంటి అయోమయ స్థితిలో హఠాత్తుగా చనిపోయిన ఉపాధ్యాయ కుటుంబాలకు సామాజిక భద్రత కరువైందని, అందువల్లనే “ఒక్కరి కోసం అందరం – అందరి కోసం ప్రతి ఒక్కరం” అన్న ఉన్నత ఆశయంతో కుటుంబ సంక్షేమ నిధి కి శ్రీకారం చుడుతుందన్నారు. యుటిఎఫ్ లో సభ్యునిగా ఉండి, యుటిఎఫ్ మాసపత్రిక “వాయిస్ ఆఫ్ తెలంగాణ” చందాదారులు అయి ఉండి ప్రభుత్వ, ప్రభుత్వ ద్రవ్య సహాయంతో నిర్వహించబడుతున్న విద్యాసంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ పథకంలో చేరవచ్చన్నారు. ఈ పథకంలో చేరేటప్పుడు సభ్యత్వం రూ.200 నిర్వహణ ఖర్చులకు, కాషన్ రిఫండబుల్ డిపాజిట్ గా రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కాషన్ డిపాజిట్ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు వడ్డీతో కలిపి తిరిగి చెల్లించబడుతుందన్నారు. ఎవరైనా ఉద్యోగి మరణించినప్పుడు సంఘీభావ విరాళంగా రూ.100 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు యుటిఎఫ్ జిల్లా కమిటీని సంప్రదించాలన్నారు.




