అమరావతి,అక్టోబర్31(జనంసాక్షి): ఆపరేషన్ గరుడ నేపథ్యంలో హీరో శివాజీని టీడీపీ నేతలు చంపేస్తారని… ఈ రాజకీయ ఉచ్చు నుంచి ఆయన తప్పుకోవాలని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ స్పందించారు. ఆమె వ్యాఖ్యల పట్ల శివాజీ అదే స్థాయిలో స్పందించాడు. చావుకు భయపడేంత పిరికివాడిని తాను కాదని అన్నాడు. తనకు చావంటే భయం లేదని… నిజాన్ని ప్రపంచానికి వెల్లడించేందుకు తాను దేనికైనా సిద్ధమేనని చెప్పాడు. లక్ష్మీపార్వతి తనపై జాలి చూపాల్సిన అవసరం లేదని… ఆమెను చూస్తుంటే తనకే జాలి వేస్తోందని ఎద్దేవా చేశాడు. వైసీపీకి అనుకూలంగా ఎన్ని వ్యాఖ్యలు చేసినా… ఆ పార్టీ తరపున ఆమెకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని చెప్పారు. తన పోరాటం ఎపి ప్రయోజనాల కోసం తప్ప ఎవరో కొందరని కోసం కాదన్నారు.




