Tuesday, 3 November 2026

చిచ్చురేపిన రెండో జాబితా!

– తెలంగాణ బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి
– పలు ప్రాంతాల్లో కార్యాలయాలపై అసంతృప్త నేతల దాడి
– ఆగ్రహం ఫర్నీచర్‌ ధ్వసం చేసిన కార్యకర్తలు
– మరో 53 స్థానాల్లో జాబితా ప్రకటనకు కసరత్తు చేస్తున్న బీజేపీ అధిష్టానం
హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి) : రెండో జాబితా ప్రకటన తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. టికెట్‌ ఆశపడి భంగపడ్డ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతున్నారు. కార్యాలయాలపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు. 28మందితో బీజేపీ శుక్రవారం రెండో విడత జాబితా విడుదల చేసింది. ఇందులో భాగంగా వరంగల్‌ వెస్ట్‌ టికెట్‌ను ధర్మారావుకు, శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు, నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు అధిష్టానం కేటాయించింది. దీంతో ఈ 3 స్థానాల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ వెస్ట్‌ నుంచి రావుపద్మ టికెట్‌ ఆశించారు. గత కొంత కాలంగా నియోజకవర్గంలో ఈమె చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం ఇంతకు ముందు ఈ స్థానం నుంచి పలుమార్లు పోటీ చేసిన ధర్మారావుకే టికెట్‌ కేటాయించింది. దీంతో రావుపద్మ మండిపడ్డారు. ఆరుసార్లు ఓడిపోయిన అభ్యర్థికి టికెట్‌ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా
బరిలోకి దిగుతానని, బీజేపీ బీ ఫారం ఎలా ఇవ్వదో చూస్తానని ఆమె హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించడంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ నరేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాదని మూడు రోజుల కిందట పార్టీలో చేరిన బిల్డర్‌ యోగానంద్‌కు టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారంటూ ఆయన పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. శేరిలింగంపల్లి నుంచి టిక్కెట్‌ ఆశించిన మరో నేత కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కూడా అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్‌ దక్కక పోవడంతో నిరసనకు దిగారు. బీజేపీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. యోగానంద్‌కు టిక్కెట్‌ కేటాయించడానికి నిరసనగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎదుట నరేశ్‌ తన అనుచరగణంతో కలిసి నిరసనకు దిగారు. యోగానంద్‌కు టిక్కెట్‌ కేటాయించడానికి గల కారణాలను తెలపాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను తనకే కేటాయించాలని కోరారు. అదేవిధంగా నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యెండలకు టిక్కెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ సూర్యనారాయణ గుప్తా అనుచరులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్‌లో బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. యెండలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరో 53 స్థానాల్లో..
బీజేపీ మొదటి విడతలో 38 స్థానాలకు, రెండో విడతలో 28 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మిగతా 53 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది. ప్రకటించిన స్థానాల్లో చిచ్చు రేగుతుండటం పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది. రెండో జాబితాలో మొత్తం 28 మంది అభ్యర్థులను ఖరారు చేయగా అందులో ఏడుగురు రెడ్డీలకు, ముగ్గురు వెలమలకు, ఒక వైశ్య, ఆరుగురు బీసీలకు, 5 ఎస్టీ, 3 ఎస్సీ, 2 మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించారు.