Thursday, 5 November 2026

చురకుగా సాగుతున్న డేటా సేకరణ

ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా బీమా పథకం ప్రారంభం

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): అన్నదాతల కుటుంబాలను ఆదుకునే నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతుబీమా పథకాన్ని ఆగస్ట్‌ 15వ తేదీన సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా డేటా సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎల్‌ఐసితో ఒప్పంద కుదరడంతో ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఫారాలు నింపే పక్రియ పూర్తయితే, జులై 15వ తేదీలోపు డేటా ఎంట్రీ పూర్తయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్నిఆగస్ట్‌ 15న లాంఛనంగా ప్రారంభింస్తారు. ఎప్పుడు ఎక్కడ అన్నది త్వరలోనే తెలియచేస్తారు. ఆ వెంటనే ఇన్సూరెన్స్‌ బాండ్‌ల పంపిణీ గ్రామగ్రామాన పండుగలా నిర్వహించే బాధ్యతను రైతు సమన్వయ సమితి సభ్యులు తీసుకోనున్నారు. రైతు బీమా పథకానికి ప్రీమియాన్ని ప్రతీ సంవత్సరం రెన్యువల్‌ చేసేలా ప్రభుత్వమే బడ్జెట్‌ కేటయించనుంది. రైతు ఏవిధంగా మరణించినా అతని సమాచారాన్ని గ్రామ పంచాయతీలో ఏఈవోలు ఇచ్చిన 24 గంటల్లోనే గ్రామ కార్యదర్శి డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరోజు ఆలస్యం జరిగినా సంబందిత కార్యదర్శి జీతంలో నుంచి వెయ్యి రూపాయలు కట్‌ అవుతాయి. దానికి అతడినే బాధ్యుతలను చేస్తారు. సర్టిఫికెట్స్‌ అందించిన పది రోజుల్లోపు జీవితాబీమా కంపెనీ వాళ్లు వచ్చి డబ్బులు అందచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5లక్షల బీమా వర్తింప జేస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వాతావరణ ఆధారిత పంటలకు రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు సైతం ఈ బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దానికి సంబంధించిన వివరాలను సైతం సేకరిస్తామని వివరించారు.