Tuesday, 3 November 2026

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

– తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు
– పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
– చల్లబడిన వాతావరణం
– వరుణిడి కరుణతో ఆనందంలో అన్నదాతలు
– విత్తు నాటే పనిలో నిమగ్నమైన రైతులు
హైదరాబాద్‌, జూన్‌28 (జ‌నం సాక్షి) : తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మాన్‌ సూన్‌ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా ముఖంచాటేసిన వానలు.. మళ్లీ పుంజుకున్నాయి. నైరుతి రుతుపవనాలు బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అటు వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం పలు ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఇక రాష్ట్ర రాజధానిలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం వాతావరణ చల్లబడడంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. మేడ్చల్‌ జిల్లా కీసరలో ఓ మోస్తరు వాన పడింది. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. కొండపాక మండలంలో భారీ వర్షం పడింది. అటు గజ్వేల్‌, ములుగు, వర్గల్‌, మర్కూక్‌ మండలాలతో పాటు సిద్ధిపేటలో వానపడింది. మెదక్‌ జిల్లా చేగుంట, నిజాంపేట, రామయంపేట, నర్సాపూర్‌, శివంపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. ఇటు ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతంలో వార్షం కురిసింది. ఖమ్మం టౌన్‌ తో పాటు  కొణిజర్ల, నేలకొండపల్లితో పాటు సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా వాన పడింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేట డివిజన్‌ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, గుండాల మండలంలో భారీ వర్షం కురిసింది.  అశ్వారావుపేటలోనూ వాన పడింది. అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా  భూపాలపల్లి, వెంకటాపురం మండలాల్లో వర్షం పడింది. నిజామాబాద్‌ లో మోస్తరు వర్షం పడగా కామారెడ్డిలో భారీ వర్షం కురిసింది. బాన్సువాడ, బీర్కూర్‌, నరసుర్ల బాద్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. జనగామ జిల్లా  స్టేషన్‌ ఘణపూర్‌, చిల్పూర్‌ మండలాల్లో వర్షం కురిసింది. అటు పెద్దపల్లి జిల్లాలోని
రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మండలాల్లో వర్షం కురిసింది. అటు కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, తిర్వాణి మండలాల్లో  వాన పడింది. అటు నల్లగొండ జిల్లాలోనూ వర్షాలు కురిసాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో చిరుజల్లులు కురిసాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో వాన పడింది. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్‌, గూడూరు మండలాలతో పాటు.. డోర్నకల్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అటు నాగర్‌ కర్నూల్‌ జిల్లా  నాగర్‌ కర్నూల్‌, బిజినెపల్లి, తెల్కపల్లి, తాడుర్‌ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అచ్చంపేట  పట్టణంలో ఓ  మోస్తరు వర్షం పడింది. వానలు మళ్లీ పుంజుకోవటంతో  రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే నాటిన విత్తనాలు మొలకొస్తారని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాలతో భూమి పదును కావటంతో విత్తనాలు నాటేందుకు రైతులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే భూమిలో తేమ ఉంటేనే విత్తనాలు నాటాలని, అలా కాకుండా అటుఇటూ కాని వర్షంతో విత్తనాలు నాటవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.