Tuesday, 3 November 2026

చెరువు నాల కబ్జాపై కమిషనర్ కు ఫిర్యాదు

వరంగల్ ఈస్ట్, జూన్ 26 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని ఉరుసు రంగసముద్రం చెరువు కు చెందిన నాలా కబ్జాపై రంగసముద్రం చెరువు రైతులతో పాటు స్థానికులు సోమవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్ లో కమిషనర్ రిజ్వాన షమీం భాషకు రైతులు సముద్రాల స్వామి, బి. రమేష్ ఫిర్యాదు చేశారు. చెరువుకు సంబంధించిన నాలా స్థలం కొద్ది నెలల క్రితం ప్రైవేటు ఫ్లాట్ యజమానులు పొందరు కబ్జా చేసి వారి ప్లాటులో కలుపుకున్నట్లు కమిషనర్ కు చెప్పారు. అంతేకాకుండా  నాలా నీరు సునాయాసంగా బయటికి వెళ్లే బట్టుపల్లి రోడ్డు మోరి స్థలాన్ని కూడా కబ్జా చేసి మోరి నుండి నీళ్లు వెళ్ళకుండా అడ్డంగా మట్టి పోసినట్లు వివరించారు. ఈ విషయమై గతంలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా కొందరు అధికారులు వచ్చి చూసి వెళ్లారు. కానీ ఎలాంటి ఫలితం లేదని ఫిర్యాదుదారులు తెలిపారు.  ఇప్పటికైనా నాలాను ఆక్రమించి గోడ నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు మోరీకి అడ్డంగా మట్టి పోసి నీళ్లు వెళ్లకుండా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకొని నీరు సునాయాసంగా బయటకు వెళ్లేలా చేయాలని కమిషనర్ను కోరారు. ఈ విషయమై కమిషనర్ సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు సమస్యపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.