జనం సాక్షి , కమాన్ పూర్ : సామాజిక సేవను ప్రతి ఒక్కరుబాధ్యతగా భావించాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గత 53 రోజులుగా నిర్వహిస్తున్న అంబలి కేంద్రాన్ని పుట్ట మధూకర్ గారు సందర్శించి అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తీ, ఆకలి తీర్చాలనే ఆలోచనతో గత 53 రోజులుగా అంబలి పంపిణీ చేయడం అభినందనీయమని, నేటి యువత ఏ విధంగా ఉండాలో సందేశం ఇస్తున్న ఛత్రపతి శివాజీ యూత్ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ఈనాడు మంథని నియోజకవర్గంలో కొంతమంది ఎలాంటి సేవలు చేయకుండానే ట్రస్టు చైర్మన్‌గా పత్రికల్లో ఫోటోలు,పేర్లు రాయించుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజలను మోసం చేస్తూ ఓట్లు వేయించుకుని అధికారం కోసం ఆరాటపడే వాళ్లు ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులను చూసి సేవ చేయాలని ఆయన హితవు పలికారు. సేవ చేయడం అంటే పత్రికల్లో పేర్లు రాయించుకోవడం, అధికారం కోసం ప్రజలనుమోసం చేయడం కాదని ఆయన దుయ్యబట్టారు. ఛత్రపతి శివాజీ ఒక మంచి సంకల్పంతో సామాజిక సేవలో భాగస్వాములు అవుతున్నారని, మహాశివరాత్రి, గణపతి, దుర్గామాత నవరాత్రుల్లో ఆధ్యాత్మికంగా తమ సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. యూత్ సభ్యులు తమ ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు సాగాలని, సేవే లక్ష్యంగా ముందుకు సాగే ఛత్రపతి శివాజీ యూత్‌ను రాజకీయాలకు అతీతంగా తనవంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గారిని ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఛత్రపతి శివాజీ యూత్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలే – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్




