Tuesday, 3 November 2026

జగదీశ్వర్‌ రెడ్డితో శాఖల దోబూచులాట

విద్యుత్‌,విద్యాశాఖల మధ్య పదవుల మార్పు
మళ్లీ విద్యుత్‌ శాఖనే కేటాయించిన సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  తొలినుంచీ మంత్రి జగదీశ్‌ రెడ్డితో విద్యుత్తు, విద్యా శాఖలు దోబూచులాడుతున్నాయి. విస్తరణ జరిగినప్పుడల్లా ఆయన శాఖ మారుతూ వస్తోంది. కేబినెట్‌ విస్తరణ జరిగినప్పుడల్లా ఆయన శాఖలు మారుతున్నాయి. కడియం శ్రీహరిని ఎంపిగా రాజీనామా చేయించి తొలిసారి కేబినేట్‌లోకి తీసుకున్నప్పుడు ఆయనకు విద్యాశాఖ కేటాయించడంతో, జగదీశ్వర్‌ రెడ్డి పోర్టు ఫోలియో మారింది. ఆయనకు విద్యుత్‌ శాఖను కేటాయించారు. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టాక జగదీశ్వర్‌ రెడ్డికి మళ్లీ విద్యా శాఖ అప్పగించారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణతో మళ్లీ శాఖ మారింది. సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ కేటాయించడంతో దాని స్థానంలో తొలి ప్రభుత్వంలో నిర్వహించిన విద్యుత్తు శాఖనే జగదీశ్వర్‌ రెడ్డికి కేటాయించారు. ఇప్పటి వరకు దీనిని సిఎం తనవద్దే ఉంచుకున్నారు. ఇకపోతే
నల్లగొండ జిల్లాకు మరో పదవి దక్కనుంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డికి శాసనమండలి చైర్మన్‌ పదవిని ఇవ్వాలనిసీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే సూర్యాపేట నుంచి జగదీశ్వర్‌రెడ్డి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుత్తాకు పదవి ఇవ్వడంతో రెండో మంత్రి పదవి జిల్లాకు దక్కుతుందని భావించినా
చివరకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన విస్తరణలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని విద్యాశాఖ నుంచి తిరిగి విద్యుత్‌ శాఖకు మార్చడం మినహా జిల్లా నుంచి ఎవరినీ కేబినెట్‌లోకి తీసుకోలేదు. వాస్తవానికి ఈసారి
మంత్రి వర్గంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవులు ఆశించారు. విస్తరణకు ఒక రోజు ముందుగానే, సునీతను శాసనసభలో ప్రభుత్వ విప్‌గా నియమించడంతో రేసులో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే మిగిలారు. గతంలో కూడా సునీత విప్‌గా పనిచేశారు.  కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి టీఆర్‌ఎస్‌లో చేరిన గుత్తాకు ఆనాడే సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారని పార్టీవర్గాల్లో ప్రచారం జరిగింది. నాడు మంత్రిగా అవకాశం కల్పించే వీలులేకనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి కట్టబెట్టారని ప్రచారం జరిగింది. ఇక, 2018 ముందస్తు ఎన్నికల్లో ఘన విజయంతో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీ పదవి ముగిశాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కోటాలో ఆయ న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు. అప్పటి నుంచి గుత్తా మంత్రిపదవి రేసులో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా ఆయనకు స్థానం ఉంటుందని భావించారు. అయితే విస్తరణలో కొత్తగా ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకోగా అందులో ఇద్దరు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారే. మిగిలిన నలుగురిని కొత్తగా కేబినెట్‌లో చేర్చుకున్నారు. ఈ కారణంగానే గుత్తా అనుచర వర్గంలో కొంత నిరాశ వ్యక్తమైంది. వివిధ సవిూకరణలు, కారణాల నేపథ్యంలోనే సుఖేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోవడంతో ఆయనకు శాసనమండలి చైర్మన్‌ పదవిని ఇవ్వాలని  సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్‌ పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ కొనసాగుతున్నారు. ఉభయ సభల బ్జడెట్‌ సమావేశాల నేపథ్యంలో శాసనమండలికి పూర్తికాలపు చైర్మన్‌ నియమించాలని నిర్ణయించడంతో ఆ పదవి గుత్తాకు కట్టబెట్టనున్నారని సమాచారం. చైర్మన్‌ పదవికి ఆయన పేరును అధికారికంగా ప్రకటించి సోమవారం నామినేషన్‌ దాఖలు చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవిని ఆశించిన గుత్తాకు చివరకు మండలి చైర్మన్‌ పదవి అందిరానుంది.అది దక్కితే శాసన మండలి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఒకే జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే వైస్‌ చైర్మన్‌గా నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన నేతి విద్యాసాగర్‌ కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం దక్కితే ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పోస్టులు దక్కినట్లు అవుతుంది.