Thursday, 5 November 2026

జనవరి వరకు నిరంతరాయంగా

‘కంటి వెలుగు’ పరీక్షలు
– అంధత్వ రహిత తెలంగాణెళి లక్ష్యంగా ‘కంటి వెలుగు’
– ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
– కంటి వెలుగు సెంటర్లను సందర్శించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారని, అందులో భాగంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు సెంటర్‌లను మంత్రి కేటీఆర్‌ నగరంలో అకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియం, హఫీజ్‌ పేట డివిజన్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌లను మంత్రి సందర్శించారు. వైద్య శిబిరంలోని సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన ప్రతిఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చికిత్సలు నిర్వహించాలని సూచించారు. అక్కడే ఉన్న మహిళలతో కేటీఆర్‌ కాసేపు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజల బాగోగులు కోరుకునే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలోని మూడు కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. బుధవారం ఒక్కరోజే నగరంలో లక్షకు పైగా ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. వచ్చే జనవరి వరకు నిరంతరంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేయనున్నట్టు వెల్లడించారు. ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్లలో గత 60ఏళ్లగా జరగని అభివృద్ధిని చేసి చూపించామని, రాబోయే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించి దేశానికే ఆదర్శం రాష్ట్రంగా తెలంగాణను నిలిపేలా కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇలాంటి సీఎం దొరకడం ప్రజల అదృష్టమని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి తెలంగాణను మరింత అభివృద్ధి చసుకొనేలా సహకరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, స్థానిక అధికారులు పాల్గొన్నారు.