జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి
– టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు హుజూర్ నగర్ డిసెంబర్ 15 (జనంసాక్షి): జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నిటిని సత్వరమే అమలు చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టాలన్నారు. వృత్తిని నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండాలని సూచించారు. కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన పిల్లలకు 50 శాతం సబ్సిడీపై విద్యను అందించాలని, అందుకోసం ప్రభుత్వం జీవో జారీ చేయాలన్నారు. జర్నలిస్టులతో పాటు డేస్కుల్లో పనిచేస్తున్న సబ్ఎడిటర్లకు కూడా పూర్తిస్థాయిలో అక్రిడేషన్లు కల్పించాలన్నారు. అనంతరం జిల్లా మహాసభ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మహాసభకు జిల్లాలోని వివిధ మండలాల నుండి తరలివచ్చి పూర్తిగా సహకరించిన
జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలో జర్నలిస్టు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు టీవీఎల్, దేనుమకొండ శేషం రాజు, బసవోజు శ్రీనివాస చారి, షేక్ జానీ పాషా, పెందుర్తి భాస్కర్ , పిల్లలమర్రి శ్రీనివాస్, దేవరం రామిరెడ్డి, ఆర్ పి గౌడు, కోమరాజు అంజయ్య, దేవరం వెంకటరెడ్డి, దాచేపల్లి దయాకర్ రెడ్డి, కీతారామనాదం, ఇట్టిమల్ల రామకృష్ణ, చిట్టిపోతుల రమేష్ బాబు పాల్గొన్నారు.
జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి




