తీరనున్న గ్రేటర్ మంచినీటి కష్టాలు
హైదరాబాద్,సెప్టెంబర్30 (జనంసాక్షి): ఇటీవలి వర్షాలకు కృష్ణా,గోదావరిల్లో భారీగా నీఉ చేరడంతో వచ్చేరెండేల్ల వరకు జంటనగారాలు, శివారు ప్రాంతాలకు మంచినీటి సమస్య ఉండదని అధికారులు
అంచనా వేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి నీరు చేరడంతో వచ్చే రెండేళ్ల పాటు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, మంజీరా, జలాశయాలు జలకళ సంతరించుకొంటున్నాయి. ఆయా ప్రాజెక్టులనుంచి నిత్యం 600 ఎంజీడీలకు పైనే నీటిని తెచ్చుకునే వెసులుబాటు ఏర్పడింది. దీంతో నగర అవసరాలతోపాటు శివార్లకూ పుష్కలంగా నీళ్లు సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పూర్తిగా జలాలు రావడంతో రోజుకు 172 ఎంజీడీలు తరలించడానికి వీలుంది. ఈ నేపథ్యంలో శివార్ల ప్రజల నీటి సమస్య తీరినట్లేనని భావిస్తున్నారు. నీటినిల్వలతో ప్రధానంగా ఐటి జోన్‌తో పాటు శివారు ప్రాంత ప్రజల తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. వచ్చే వేసవి నుంచి వారికి సమృద్ధిగా నీటిని అందించాలని జలమండలి నిర్ణయించింది. ఇందుకోసం 12 మున్సిపల్ సర్కిళ్లలో 58 రిజర్వాయర్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొత్తగా తాగునీటి పైపులైన్ విస్తరణ చేపడుతున్నారు. ఈ పనులన్నీ వచ్చే ఫిబ్రవరి నాటికి కొలిక్కి రానున్నాయని తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి శివారు మున్సిపల్ సర్కిళ్లకు రోజూ లేదంటే రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ప్రధాన నగరంలో మాత్రమే రోజు విడిచి రోజు నీళ్లు అందుతున్నాయి. శివారు ప్రాంతాల్లో చాలా నల్లాలకు 3-5 రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు.ఈ పరిస్థితిని అనువుగా మలుచుకొని ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా కోట్ల నీటి వ్యాపారం సాగిస్తోంది. శివారు మున్సిపల్ సర్కిళ్లను గ్రేటర్లో కలపక ముందు ఇక్కడ తాగునీటి సరఫరాను ఆయా మున్సిపాలిటీలు చూసేవి. గ్రేటర్ హైదరాబాద్‌లో కలిపిన తర్వాత జలమండలి పరిధిలోకి వీటిని చేర్చారు. పూర్తిస్థాయిలో రిజర్వాయర్లు, పైపులైన్ వ్యవస్థ లేకపోవడం వల్ల నీటి కష్టాలు షరామామూలుగా మారాయి. ఈ దుస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం రూ.1900 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థ విస్తరణకు పనులు చేపట్టింది. అనుకున్న సమయం కంటే ముందే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉన్నందున ఇక మంచినీటి సరఫరాకు ఢోకా ఉండదని భావిస్తున్నారు.
జలశయాలకు నీటి చేరిక




