Tuesday, 3 November 2026

జాతీయస్థాయిలో మెరిసిన బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులు. – జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ 18 మంది విద్యార్ధులకు అడ్వాన్స్డ్ కు అర్హత.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 29, (జనంసాక్షి )నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) శనివారం విడుదలచేసిన జేఈఈ మెయిన్స్ రెండవ సెషన్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ బెల్లంపల్లి విద్యార్ధులు సత్తా చాటారు. 32మంది విద్యార్థులు ఈపరీక్ష రాయగా 18మంది విద్యార్ధులు ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హతసాధించినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు.
వీరిలో సిలివేరు వినయ్ 81.37 పర్సెంటైల్ తో కళాశాల టాప్ గా నిలువగా తేజావత్ సిద్దు (ఎస్టీ విభాగంలో 7008 జాతీయస్థాయి ర్యాంకుతో) మొదటి స్థానంలో నిలిచాడు. ముంజం అంజన్న (74.98), ఎనగందుల మౌర్య (74.47), వైరాగడె రాహుల్ కుమార్ (74.30), చునార్కర్ అఖిలేశ్వర్(71.31), తేజావత్ సిద్దు(69.35) విద్యార్ధులు ఉత్తమ పర్సెంటైల్స్ సాధించి తరువాతి స్థానాల్లో నిలిచారన్నారు. జాతీయస్థాయిలో పి విశాల్ (ఎస్టీ)1109 ర్యాకు సాధించడం గర్వంగా ఉందన్నారు.
పరీక్షకు హాజరైనవారిలో సగానికి పైగా అడ్వాన్స్డ్ కు అర్హత పొందడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రీజినల్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూపరాణి ఆనందం వ్యక్తంచేశారు, ఈ సందర్భంగా వారు ఫోన్ ద్వారా విద్యార్ధులను, ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించారు. ఏప్రిల్ 6 నుండి 15వ తేది వరకు జెఈఈ మెయిన్స్-2023 రెండవ సెషన్ జరిగింది. ఈ పరీక్షలో కటాఫ్ పర్సెంటైల్ తో అడ్వాన్స్డ్ కు అర్హత సాధించిన వారికి జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. దీనిలో ప్రతిభ చూపిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి లలో అడ్మీషన్స్ ఇస్తారు. ఈసందర్భంగా శనివారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు విద్యార్ధులను పుష్పగుచ్చాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
ఈకార్యక్రమంలో అధ్యాపకులు నాగినేని శ్రీరామవర్మ, మిట్టా రమేష్, చందా లక్ష్మీ నారాయణ, అనుముల అనిరుద్, ఎండి రఫీ, సుంకరి అర్జున్, కట్ల రవీందర్, సురేష్ గౌడ్, సిబ్బంది సమేందర్, తేజశ్వి, రాజశేఖర్, ఐ మల్లేష్ పాల్గొన్నారు.