Wednesday, 4 November 2026

జాతీయ స్థాయి లో మరోసారి నెంబర్-1 స్థానంలో వెలిగిన సింగరేణి థర్మల్

జాతీయ స్థాయి లో మరోసారి నెంబర్-1 స్థానంలో వెలిగిన సింగరేణి థర్మల్
91.15 పీఎల్ఎఫ్ తో ప్రతిభ చాటిన ఎస్టీపీపీ…….
దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ విద్యుత్ కేంద్రం…..
………మూడో త్రైమాసికాంతానికి దేశంలో అగ్రస్థానం….
ఛైర్మ న్ ఎండీ ఎన్.శ్రీధర్..అభినందనలు….
—సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ ఎఫ్) సాధించి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికాంతానికి (ఏప్రిల్ నుంచి డిసెంబరు 31 నాటికి) మరోసారి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటింది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వారు రూపొందించిన దేశంలోని అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో అత్యధికంగా 91.15 శాతం పీఎల్ఎఫ్ తో సింగరేణి థర్మల్ ప్లాంట్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశంలో గల సుమారు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల పీఎల్ఎఫ్ లను దాటి సింగరేణి థర్మల్ ప్లాంట్ ఈ స్థానాన్ని అందుకోవడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో సారి.
దీనిపై సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ తన హర్షం ప్రకటిస్తూ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తమ సంస్థ జాతీయ స్థానంలో అగ్రస్థానంలో నిలవడం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అతి తక్కువ సమయంలో అగ్రస్థానానికి ఎదిగిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
2016 ఆగస్టు లో ప్రారంభమైన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే తన అద్భుతమైన ప్రతిభతో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. కరోనా సమయంలో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల కన్నా అత్యధిక పీఎల్ఎఫ్ సాధిస్తూ ఈ విభాగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో గత నవంబరు నెల నుంచి ప్రభుత్వ సంస్థ లతో పాటు అన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న 250 కి పైగా ఉన్న థర్మల్ కేంద్రాల కన్నా అత్యధిక పీఎల్ఎఫ్ నమోదు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. దేశంలో ప్రముఖ ప్ర భుత్వ, ప్రైవేట్ విద్యుత్ సంస్థలైన ఎన్టీపీసీ, అదానీ, టాటా, రిలయన్స్, జిందాల్ తదితర సంస్థల ను కూడా దాటి నెంబర్ వన్ గా నిలవడం గమనార్హం.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పరిశ్రమలు పలు అభివృద్ధి సూచికల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ఆదర్శవంతంగా ఉంటున్న నేపథ్యంలో తెలంగాణ పరిశ్రమ అయిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా అదే బాటలో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెస్తోంది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెల్లడించిన నివేదికలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 7219 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో 91.15 పీఎల్ఎఫ్ తో ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ఎస్టీపీసీ వారి కోర్భా ప్లాంట్ నిలిచింది. మూడో స్థానంలో ఎస్టీపీసీ వారి సింగ్రౌలి( ఉత్తర ప్రదేశ్ ) ప్లాంట్ నిలిచింది. నాలుగో స్థానంలో వింధ్యాచల్ ప్లాంట్(మధ్య ప్రదేశ్), ఐదో స్థానంలో బక్రేశ్వర్ ప్లాంట్ (పశ్చిమ బెంగాల్), ఆరో స్థానంలో రిహాంద్ ప్లాంట్( ఉత్తర ప్రదేశ్) నిలిచాయి.
సీఈఏ ప్రచురించిన 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ ప్లాంట్ కు చోటు దక్కలేదు.
రాష్ట్ర ప్రగతికి విద్యుత్ అందిస్తూ … సింగరేణికి లాభాలు పంచుతూ..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తనవంతు పాత్రను సమర్థంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రగతిలో పాలుపంచుకుంటోంది. ఇప్పటి వరకు ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం 52328 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కు అందించి తెలంగాణ వినియోగిస్తున్న మొత్తం విద్యుత్ లో 12 శాతాన్ని సమకూర్చుతోంది. అలాగే సింగరేణి సంస్థ కు ఏటా సగటున 400 కోట్ల రూపాయలకు పైగా లాభాలను కూడా అందిస్తోంది.
ఈ ప్లాంట్ లో ఉన్న రెండు యూనిట్లు అత్యంత సమర్థంగా పనిచేస్తుండటం మరో విశేషం. నెలావారీ పనితీరును పరిశీలిస్తే రెండో యూనిట్ ఇప్పటికి 10 సార్లు వంద శాతం పీఎల్ఎఫ్ దాటి విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. కాగా, మొదటి ప్లాంట్ ఎనిమిది సార్లు నూరు శాతం పీఎల్ఎఫ్ ను దాటడం విశేషం. మొత్తమ్మీద సింగరేణి థర్మల్ ప్లాంట్ ఇప్పటికి నాలుగుసార్లు వంద శాతం పైబడి పీఎల్ఎఫ్ ను సాధించింది.
ఈ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రత్యేక చొరవతో అతి తక్కువ సమయంలో పూర్తి చేయించిన సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ అనంతరం కూడా క్రమం తప్పకుండా ప్రతీ నెలా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్లాంట్ పురోగతికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఫలితంగా ఈ ప్లాంట్ పీఎల్ ఎఫ్ లోనే కాకుండా ఫ్లైయాష్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి అంశాల్లో అద్భుత ప్రతిభ చూపుతూ పలు జాతీయ స్థాయి అవార్డులు అందుకుంది.
ముఖ్యమంత్రి ఆదేశంతో త్వరలోనే మరో ప్లాంట్…
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తోడ్పడేందుకు మరో 800 మెగావాట్ల ప్లాంట్ ను థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణం లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక కూడా సమర్పించి అనుమతి పొందడం జరిగింది. ఈ నెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మార్చి నెల నుంచి నిర్మాణపు పనులు ప్రారంభించాలని, కాలపరిమితికి లోపే పనులు పూర్తి చేయాలని ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించగా.. దీనిపై డైరెక్టర్(ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో పనులు వేగంగా నడుస్తున్నాయి..
-జనం సాక్షి