గద్వాల నడిగడ్డ, మే 26 (జనం సాక్షి);
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం జూన్ 2 నుండి 22 వరకు (21) రోజులు జరిగే కార్యక్రమాలకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి రోజువారి కార్యక్రమం విజయవంతం చేయుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, 9 ఏళ్లలో జిల్లా ప్రగతిపై అన్ని శాఖల అధికారులు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. శాఖలవారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని రావాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యేలా చూడాలన్నారు. మండల కార్యాలయాలు అందంగా పూల తోరణాలతో సిద్ధం చేయాలన్నారు. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు పూర్తి ప్రణాళికతో ఉండాలన్నారు. . పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ముందు తర్వాత జరిగిన పనులపై నివేదిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి కార్యక్రమానికి దశాబ్ది లోగో ఉండాలన్నారు. ఇరిగేషన్ శాఖ వారు చెరువుల దగ్గర చెరువుల అభివృద్ధిపై వివరించి,మత్స్యశాఖ చేపలు పట్టే వారిని ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువు కట్టల దగ్గర భోజనాలు పెట్టాలన్నారు. ఇళ్ల పట్టాలు అందజేసేందుకు సిద్ధం చేయాలన్నారు. 75 చదరపు గజాల ఇంటి స్థలం ఉండేందుకు లేఅవుట్ తయారుచేసి పట్టాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీకి ఏర్పాటు చేయాలన్నారు. కుల వృత్తుల వారిని గుర్తించి వారి పేర్లు నమోదు చేయాలన్నారు. 9 సంవత్సరాల తెలంగాణలో జరిగిన వివిధ శాఖల అభివృద్ధిపై ఆయా శాఖలో పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేసుకుని రావాలన్నారు.
ఈ టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్డీవో రాములు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్
జూన్ 2న అన్ని జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణ, జూన్ 3న రైతు దినోత్సవం,
జూన్ 4న పోలీసుల ఆధ్వర్యంలో సురక్షాదినోత్సవం,జూన్ 5న విద్యుత్ విజయోత్సవం,జూన్ 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం,జూన్ 7న సాగునీటి దినోత్సవం,జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ,జూన్ 9న సంక్షేమ సంబురాల నిర్వహణ,
జూన్ 10న సుపరిపాలన దినోత్సవం,జూన్ 11న సాహిత్య దినోత్సవం నిర్వహణ,జూన్ 12న తెలంగాణ రన్ నిర్వహణ, జూన్ 13న మహిళా సంక్షేమ దినోత్సవం,జూన్ 14న వైద్యారోగ్య దినోత్సవం,
జూన్ 15న పల్లె ప్రగతి దినోత్సవం,జూన్ 16న పట్టణ ప్రగతి దినోత్సవం,జూన్ 17న గిరిజనోత్సవం, జూన్ 18న మంచినీళ్ల పండుగ,జూన్ 19న హరితోత్సవం,జూన్ 20న విద్యా దినోత్సవం,
జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం,జూన్ 22న అమరుల సంస్మరణ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.




