Wednesday, 4 November 2026

జిల్లా ఉత్తమ ఎంపీపీగా అవార్డు అందుకున్న హరికృష్ణ

శివ్వంపేట జూన్ 16 జనంసాక్షి : శివ్వంపేట మండలంలో ఒకప్పుడు ఏ ఊరికి పోయినా ఎదురుగా వచ్చేది పెంట కుప్పలు, ఆ పెంట కుప్పల పైన కోళ్ల తవ్వకాలు, బూడిదలో బొర్లే కుక్కలు స్వాగత వచనాలుగా ఉండేటివి. ఇదంతా కూడా నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని పిలుపునిచ్చిన భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే పల్లె ప్రగతి పథకానికి శ్రీకారం చుట్టి డంపుయార్డ్ ల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టి గ్రామాలను సుందర వదనంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎత్తు అయితే రెండవ ఎత్తు 2016 నుంచి మొదలుకొని 2020 డిసెంబర్ లోపే శివ్వంపేట మండలాన్ని ఓడిఎఫ్ మండలం గా జిల్లా పాలన యంత్రాంగం గుర్తించింది. ఈ శివ్వంపేట మండలానికి ఎంపీపీగా కొనసాగుతున్న మండల పరిధిలోని ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన కల్లూరి హరికృష్ణ నిర్విరామ కృషి అమోఘం. కొన్ని గ్రామాలలో ఏమీ తెలియని సర్పంచులు, అమాయక ఎంపీటీసీలు ఉన్నా కానీ పాలనలో ఎక్కడ తీసిపోకుండా, గ్రామ, మండల పాలన బరువంతా తన భుజస్కందాలపై వేసుకొని ఆ గ్రామాలలో రెండు, మూడు రోజులపాటు మకాం వేసి అక్కడే మండల స్థాయి అధికారులతో సమీక్షలు జరిపి ఇక్కడికక్కడ అదే గ్రామంలో అందరూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టే విధంగా ఒప్పించి, 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం, అదేవిధంగా మురికి కాలువల నిర్మాణం సంపూర్ణ పారిశుధ్యం కోసం గ్రామంలోని అన్ని వీధులన్నీ సిసి రోడ్ల మయం చేసి మండలంలోని గ్రామాలను బంగారు తునకలాగా తీర్చిదిద్దిన ఘనత శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణకు దక్కుతుందనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఈ పదవి కాలంలో శివంపేట మండలానికీ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. ప్రస్తుత మెదక్ జిల్లాలో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో గాని, అభివృద్ధి ఫలాలను గ్రామాలకు చేర్చి అన్ని రంగాలలో అభివృద్ధిని పరుగులు పెట్టించి, ఈరోజు శివ్వంపేట మండలం జిల్లాలోనే ప్రథమ స్థానం దక్కించుకున్నది. అందుకు పగలు రాత్రి తేడా లేకుండా నిర్విరామ కృషి చేసిన ఎంపీపీ కల్లూరి హరికృష్ణ సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మెదక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా చీఫ్ పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శుక్రవారం ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ను శాలువాతో సన్మానించి, ప్రశంస పత్రాన్ని షీల్డ్ అందజేశారు. ఆయన మండలానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు బాలమణి నరేందర్, రంగీలా ఆంజనేయులు, చెన్నా నాయక్, రాజు నాయక్ లతోపాటు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.