Monday, 2 November 2026

జీవో 39ని రద్దు చేయండి

-గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13,(జనంసాక్షి): రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 39ని రద్దు చేయాలని అఖిలపక్షం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఐకాస నేతలు ఉమ్మడిగా గవర్నర్‌ను కలిసి జీవో 39 వల్ల జరిగే నష్టాలను వివరించారు. తెరాస కార్యకర్తల ప్రయోజనం కోసమే ఈ సమితులు ఏర్పాటు చేస్తున్నారని, ఇది ప్రజా ప్రతినిధుల హక్కులను హరించేదిగా ఉందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క విమర్శించారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కల్పించిన హక్కులకు, రైతు సమితులు ఏర్పాటు విరుద్ధమని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు అన్నారు. గ్రామాల్లో నిరంకుశ పాలనను నిర్మించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు నిరసనగా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజున గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆచార్య కోదండరామ్‌ వివరించారు. ఈ నెల 15న వ్యవసాయ కమిషనరేట్‌ ముందు ధర్నాకు దిగనున్నట్లు చెప్పారు.