సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు రావడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని, వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ఆ సంఘ సూర్యాపేట మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.నాగయ్య , సిహెచ్ వెంకటయ్య లతో కలిసి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు.ఇటీవల సీఎం కేసీఆర్ నూతన సెక్రటేరియట్ లో మొదటి సంతకం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైల్ పై సంతకం చేసి పంచాయతీ కార్యదర్శులను మాత్రం పక్కకు పెట్టడం సరికాదన్నారు. ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి నెగటివ్ మార్కుల విధానంలో పరీక్ష నిర్వహించి, గ్రాడ్యుయేషన్ విద్యార్హత పెట్టి నియమించుకొని పే స్కేల్ ఇవ్వకుండా కన్సాలీడేట్ పే ఇవ్వడం సరికాదన్నారు. నియామక ఉత్తర్వుల్లో మూడేళ్లు అప్రెంటిస్ పీరియడ్ అని చెప్పి దానిని నాలుగేండ్లకు పొడిగించి నాలుగేండ్లు దాటినా రెగ్యులర్ స్కేల్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వారికి సర్వీస్ రూల్స్ రూపొందించి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ప్రమోషన్స్, బదిలీలు, కారుణ్య నియామకాలు లాంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.




