రంగంలోకి దిగిన అధికార ప్రతినిధి వేణు
కెసిఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడి
ఆదిలాబాద్,నవంబర్21(జనంసాక్షి): ఎన్నికలు సవిూపిస్తుండడంతో జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి వివిధ నియోజకవర్గాల్లో చురకుగా పాల్గొంటున్నారు. ఆయన ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది పక్కన పెట్టి ముందుకు సాగుతున్నారు. రైతును రాజుగా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధుతో పాటు ఇతర పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.1400 కోట్లతో కుప్టి ప్రాజెక్టు నిర్మాణం, హైడల్ విద్యుత్ తయారీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో దళితబస్తీ పథకంలో భాగంగా 3 వేల ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడినట్లు తెలిపారు. మహాకూటమి అభ్యర్థులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న వేణుగోపాలాచారి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని
కోరారు. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నాయకులతో కలసి పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో పేదల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. కులసంఘాలు ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను గుర్తించి వారి ఉపాధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. గొల్ల, కుర్మలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్య్సకారులకు ఉచితంగా చేపల పిల్లల పంపిణీతో పాటు మార్కెటింగ్ కోసం వాహనాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ మరో 20 సంవత్సారాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటు న్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు స్వచ్చందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్ని వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్ను ఓడించలేవన్నారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు ఒకవైపు తెలంగాణ పథకాలను మెచ్చుకుంటున్నారని.. కానీ స్థానిక బీజేపీ నాయకులకు మాత్రం అభివృద్ధి కనిపించక పోవడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు మెచ్చుకుంటూ.. మరోవైపు విమర్శించడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాలుగు సంవత్సరాలలో ప్రజలు కోరుకున్న పాలననే కేసీఆర్ అందించారన్నారు. మహా కూటమి నాయకులు చెప్పిన మాయ మాటలను నమ్మి ఓటేస్తే మరో ఐదేండ్లు రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతుందన్నారు. కేసీఆర్పై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని అందుకే ఇపుడు రాష్ట్రంలో వచ్చేది టీఆర్ఎస్ సర్కారేనని స్పష్టంచేశారు. , రైతుబంధు, ఉచిత విద్యుత్తుతో తమ బతుకుల్లో మార్పు వచ్చిందని వారు ఆనందంగా ఎంపీతో చెప్పారు. తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి అభాసుపాలు కాక తప్పదని అన్నారు.




