గందరగోళం లేకుండా పారదర్శక ప్రయత్నం
ఆదిలాబాద్,నవంబర్21(జనంసాక్షి): ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. డీసెంబర్ 7న అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తులతో పాటు ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉప సంహరణకు గడువు తర్వాత ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించనుంది. ప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్లు వేయడానికి వస్తున్న అభ్యర్థుల నుంచి ఫొటోలను స్వీకరిస్తున్నారు. తుది జాబితా ప్రకటన తర్వాత ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల ఫొటోలు ఈవీఎంలపై వారి గుర్తులకు ఎదురుగానే ఏర్పాటు చేయనుంది. డిసెంబర్ 7న నిర్వహించే ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 518పోలింగ్ స్టేషన్ల పరిధిలో మహిళలు 98,645 మంది, పురుషులు 98,157 మంది, 47 మంది ఇతరులు, బోథ్ నియోజకవర్గంలో పురుషులు 89,239 మంది, మహిళలు 91,459 మందితో పాటు 16 మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ అంశం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఈవీఎంలపై ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గుర్తులు మాత్రమే ముద్రించేది. ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీల అభ్యర్థుల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఈ ఈవీఎంలపై ఓటర్లకు కనబడేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఓటర్లు ఎన్నికల సమయంలో గుర్తులను చూసి ఈవీఎం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల పోటోలు లేక పోవడం వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో కొంత ఇబ్బంది పడుతున్నారని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి ఈవీఎంలపై ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గుర్తులతో పాటు వాటికి సంబంధిత అభ్యర్థి ఫొటోను ముద్రించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఆదేశాలు అందాయి.




