Wednesday, 4 November 2026

జోహార్ కామ్రేడ్ కటకం సుదర్శన్ అన్న.

బెల్లంపల్లి, జూన్ 4, (జనంసాక్షి )
జోహార్ కామ్రేడ్ కటకం సుదర్శన్ అన్న అని బెల్లంపల్లి కన్నాల బస్తీ మారుమోగి పోయింది. మే 31న గుండెపోటు తో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ మరణించాడని మావోయిస్టు పార్టీ ప్రకటన జారీ చేయడంతో బెల్లంపల్లి పట్టణం ఉలిక్కి పడింది. బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కామ్రేడ్ కటకం సుదర్శన్ @ ఆనంద్ మరణవార్త విన్న అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కన్నాల బస్తిలోని ఆయన ఇంటికి చేరుకొని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ కటకం సుదర్శన్ అన్న తాడిత, పీడీత జనాల విముక్తి కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తుది వరకు పోరాడి తుది శ్వాస విడిచాడని, ఆయన మరణవార్తతో జిల్లా దిగ్బ్రాంతికి లోనైందని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇంచార్జి రేగుంట చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట ప్రవీణ్, నాయకులు చిప్ప నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.