రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 4. (జనం సాక్షి). శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌరస్తా వద్ద మహిళలు పోలీసులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో పోలీసు శాఖ ప్రతిష్టాత్మకం అయ్యిందని అన్నారు. జిల్లాలో శాంతిభద్రతను పరిరక్షించడంలో పోలీసులు ప్రజల్లో భాగస్వాములై పనిచేస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో 38 కోట్ల 50 లక్షల రూపాయలతో పోలీసు కార్యాలయాల సముదాయ భవనం నిర్మించడం జరిగిందని త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. షీ టీం ద్వారా మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ ద్వారా వివిధ విభాగాల నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజలతో మమేకమై సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు ఎస్పీ చంద్రయ్య, 17 బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, డీఎస్పీలు నాగేంద్ర చారి సిఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




