పునాదులు కదులుతున్నాయన్న రమణ
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): కేసీఆర్ కుటుంబం మినహా ఇతర తెరాస నేతలను క్షేత్రస్థాయిలో ప్రజలు అడ్డుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎంతగా వ్యతిరేకత ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో తెరాస పునాదులు కదులుతున్నాయని, ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని జోస్యం చెప్పారు. 50 రోజుల్లో వంద సభలు పెడతామన్న తెరాస నేతలు 56 రోజుల్లో నాలుగు సభలకే పరిమితమయ్యారని విమర్శించారు. గజ్వేల్‌లో కూడా ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయని చెప్పారు. దేశంలో రాజకీయ వ్యవసాయానికి తెదేపా ముందుకు కదలిందన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు దిల్లీ పర్యటనకు వెళ్లలేదని, దేశ ప్రతిష్ఠ కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం ఆయన చొరవ తీసుకున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. భాజపా దుష్పరిపాలనపై రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకే హస్తినకు వెళ్లారన్నారు. మోదీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, చంద్రబాబు పర్యటన చరిత్రాత్మకం కానుందన్నారు. భాజపాపై పోరాడుతున్న చంద్రబాబుకు అన్ని పార్టీలూ అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని రావుల చెప్పారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపాది ప్రజాపక్షమే అని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని, కేసీఆర్ కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమిలో సీట్ల కోసం తామెప్పుడూ ఆలోచించలేదని.. కాంగ్రెస్ ప్రకటించిన 14 సీట్లపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. నయా గడీల పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రమణ చెప్పారు. త్వరలోనే తెదేపా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. సామాజిక సమతుల్యంతో దీన్ని పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా ముందుకెళ్తామని రమణ వివరించారు.




