Friday, 6 November 2026

టిఆర్‌ఎస్‌ తుపాన్‌లో కూటమి కొట్టుకుపోతుంది

డిసెంబర్‌ 11న మహాకూటమి కనుమరుగవుతుంది

నామినేషన్‌ సమయంలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ తుఫాన్‌ ధాటికి అన్ని పార్టీలు కొట్టుకుపోతాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ వేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలను సమానంగా కాపాడినట్లు చెప్పారు. అందుకే సూర్యాపేట ప్రజలు గులాబీ పార్టీకే మద్దతుగా ఉన్నారని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తెలంగాణ వ్యతిరేక టీడీపీతో జట్టుకట్టి చరిత్ర హీనులుగా మిగిలారని అన్నారు. అమరావతి, ఢిల్లీలో తమ ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన అన్ని హావిూలను నెరవేర్చడంలో సఫలం అయ్యామని అన్నారు. ఎన్ని కూటములు వచ్చినా తెలంగాణలో కేసీఆర్‌ విజయాన్ని అపలేరని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11న మహాకూటమి కనుమరుగవుతుందని జగదీష్‌ రెడ్డి వివరించారు.