టిడిపిని గెలిపించానన్న భ్రమలో పవన్ కళ్యాణ్
పవన్‌కు అభివృద్ది కనిపించడం లేదన్న గంటా
విశాఖపట్నం,జూలై10(జనం సాక్షి ): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. అసత్యాలతో ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. విశాఖపట్నంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌కు 25 ప్రశ్నలను సంధించారు. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల్ని పవన్ కళ్యాణ్ కళ్లతో చూడలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది తానే అనే భ్రమలో ఆయనున్నారని ఆక్షేపించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన నిధుల లెక్కపై పవన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని గంటా నిలదీశారు. రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్… మోదీ, అమిత్ షాను ప్రశ్నించడానికి మాత్రం సాహసం చేయలేకపోతున్నారని గంటా విమర్శించారు. భాజపా మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లు ఉందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన దస్త్రాలు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని.. వీటి గురించి మాట్లాడే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు.
—–