
అడిలైడ్: వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా దుమ్ములేపింది. గత వార్మప్ మ్యాచ్ లో ఆసీస్ పై చావుదెబ్బ తిన్న టీమిండియా ఈ మ్యాచ్ లో మాత్రం పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ(150) దూకుడుకు టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా తోడైంది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు సురేష్ రైనా(75) చూడముచ్చటైన ఆటతో అలరించడంతో పాటు, అజ్యింకా రహానే(88*) పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 364పరుగులు చేసింది.
ఇదిలా ఉండగా ప్రధాన ఆటగాళ్లు శిఖర్ ధావన్(4), విరాట్ కోహ్లి(5), మహేంద్ర సింగ్ ధోనీ(10) పరుగులకే పెవిలియన్ కు చేరడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో హమీద్ హాసన్, దావ్లత్ జర్దాన్, షాపుర్ జర్దాన్, మహ్మద్ నబీలకు తలో వికెట్ దక్కింది.




